
కిరణ్, బాబు సమైక్య ద్రోహులే: దాడి వీరభద్రరావు
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరూ సమైక్య ద్రోహులేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు దుయ్యబట్టారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరూ సమైక్య ద్రోహులేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనను ఆపాలన్న చిత్తశుద్ధి వారికి ఏమాత్రమూ లేదన్నారు. కాకమ్మ కబుర్లతో వారిద్దరూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ సోమవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. విభజన ప్రక్రియను పూర్తి చేయించేందుకు సమైక్యం ముసుగులో సోనియాకు కోవర్టులుగా పని చేస్తున్నారన్నారు. ‘‘విభజన ఆపాలనే చిత్తశుద్ధి కిరణ్‌కు ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసేవారు. అప్పుడు సోనియా దిగొచ్చేవారు. కానీ కిరణ్ రాజీనామా చేయకుండా, మంత్రులనూ చేయనీయకుండా అడ్డుపడ్డారు. విభజన తుపాను ఆపుతానని కిరణ్ చెబుతుంటే మరోవైపు ఢిల్లీలో ఆ తుపాను కొనసాగుతూనే ఉంది. ఎందుకింకా ప్రజలను మోసం చేస్తారు?’ అని ప్రశ్నించారు. మళ్లీ ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటున్న చంద్రబాబు ముందుగా తాను తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా, సమైక్యాంధ్రకు అనుకూలమా వ్యతిరేకమా అన్నది చెప్పాలన్నారు. విభజన లేఖను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూపీఏపై తాము అవిశ్వాసం పెడితే మద్దతిస్తారా అన్న టీడీపీ నేతల సవాలుపై దాడి మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టినా మా పార్టీ కచ్చితంగా మద్దతిస్తుంది’’ అని స్పష్టం చేశారు. దమ్ముంటే వచ్చే శాసనసభా సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలంటూ టీడీపీకి సవాలు విసిరారు. అలాగే లోక్‌సభ ఎన్నికల తరువాత యూపీఏకు వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందంటూ టీడీపీ దుష్ర్పచారం చేస్తోందంటూ దుయ్యబట్టారు. ‘‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా 100 లేదా 150 లోక్‌సభ స్థానాలకు మించి రావు. కానీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దానికి జగన్ మద్దతిస్తారనీ చెబుతోంది, అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టీడీపీ కోరికా?’’ అని ప్రశ్నించారు.
అనిల్‌పై బీజేపీ ఆరోపణలకు ఖండన
బ్రదర్ అనిల్‌కుమార్ ఎయిర్ షోలో పాల్గొన్న ఒక ఫోటోను చూపించి ఆయనపై బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరి కాదని దాడి అన్నారు. వాటిని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోందన్నారు. ఆరోపణలు చేసే వారు కచ్చితమైన ఆధారాలుంటే చూపాలని సవాలు చేశారు. ‘‘ఎయిర్‌షో అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే అన్ని పార్టీల వాళ్లూ వచ్చి కలుసుకుంటూ ఉంటారు. వాటిని చూపి ఆరోపణలు చేయడం దారుణం’’ అన్నారు.