హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన మాటకు అధిష్టానం విలువ ఇవ్వడం లేదని అంటున్నప్పుడు.. పదవిలో కొనసాగడం ఎందుకని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి నిలదీశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఎస్పీవై రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం శుభపరిణామం అని తెలిపారు. కిరణ్ వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆయనపై శోభా మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించిన అనంతరం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి.. జగన్ పార్టీలోకి రావడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయనుందని భావిస్తున్నారు.