ఆదిలాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుల స్వభావం తేటతెల్లమైందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఆదిలాబాద్‌లో ముల్కీ అమరుల సంస్మరణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు.
తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్.. ఇప్పుడేమో నిర్ణయాలు పార్టీలు కాదు ప్రజలు తీసుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వారిద్దరు ఆంధ్ర ప్రాంత నాయకుల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులను హైదరాబాద్‌లో బతకనివ్వరనడంలో వాస్తవం లేదన్నారు. హైదరాబాద్‌లో భూములమ్మి ఫ్లై ఓవర్లు, రింగ్‌రోడ్లు, హైటెక్‌సిటీని నిర్మించి సీమాంధ్రులకు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు, అంతా తానే చేశానని చెప్పుకోవడం సరికాదన్నారు. సీమాంధ్ర నేతల పాలన కారణంగానే హైదరాబాద్‌లో ఫార్మా, ఇతర పరిశ్రమలన్నీ మూతడ్డాయని ధ్వజమెత్తారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.