దమ్ముంటే నాపై పోటీ చెయ్!: కిషన్‌రెడ్డి
అసదుద్దీన్ ఒవైసీకి కిషన్‌రెడ్డి సవాల్
గెజిట్ తర్వాత ఆర్డినెన్స్ ఎలా తెస్తారు: నాగం
6న తెలంగాణ అభివృద్ధిపై సదస్సు
11న రాజ్‌నాథ్ సింగ్ రాక
బీజేపీలో చేరిన ఖమ్మం జిల్లా నేతలు
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే తనపై అంబర్‌పేట నియోజకవర్గంలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. నరేంద్రమోడీ హైదరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని అసదుద్దీన్ సవాల్ చేయడాన్ని ఎద్దేవా చేశారు. ఒవైసీని ఓడించడానికి తమ పార్టీ సామాన్య కార్యకర్త సరిపోతారన్నారు. పార్టీ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, ప్రదీప్‌కుమార్, డాక్టర్ మల్లారెడ్డి, ఎస్.కుమార్, ప్రేమేందర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
మజ్లిస్ అసలు పార్టీయే కాదని, అరాచక మతతత్వ శక్తని దుమ్మెత్తిపోశారు. రజాకార్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఎంఐఎం నేతలు దేశవ్యతిరేక శక్తులని, ఒకసారి జైలుకు వెళ్లివచ్చినా బుద్ధిమారలేదని విమర్శించారు. జైల్లో పడినపుడు సోనియా, అహ్మద్‌పటేల్‌తో కుమ్మక్కై బయటపడిన విషయం జగమెరిగిన సత్యమేనన్నారు. తెలంగాణ రాకుండా నెల రోజుల పాటు సోనియా, మన్మోహన్‌తో మంతనాలు జరిపిన వ్యక్తికి బీజేపీ గురించి మాట్లాడే హక్కు, అర్హత లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మజ్లిస్ జాగీరు కాదన్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఇది తగిన సమయం కాదని, ఈ వ్యవహారాన్ని అన్ని పార్టీలు యోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 11న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే విజయోత్సవ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారని, 6న తెలంగాణ అభివృద్ధిపై మేధావులు, ఎన్జీవోలు, జేఏసీతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రకు బదలాయించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. దీనిపై పోరాడతామన్నారు. కాగా, ఖమ్మం జిల్లా నాయకులు చందా లింగయ్య, కుంజా భిక్షం, డాక్టర్ రమాదేవి తదితరులు బీజేపీలో చేరారు.
గెలిస్తేనే మనుగడ: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలవకపోతే మనుగడకే ముప్పు ఏర్పడుతుందని బీజేపీ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించి మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రాంత నేతలు సోమవారమిక్కడ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
తెలంగాణలోని 56 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర నేతను బాధ్యునిగా నియమించింది. తెలంగాణ తమతోనే సాధ్యమైందన్న నినాదంతోపాటు అభివృద్ధి ఎజెండాతో ఎన్నికల్ని ఎదుర్కోవాలని నిర్ణయించింది. సమావేశంలో పార్టీ నేతలు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ప్రదీప్‌కుమార్, డాక్టర్ టి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.