రుచి‘కరవై’న భోజనం
- కొండెక్కిన కూరగాయల ధరలు.. విద్యార్థులకు అందని పోషకాహారం
- పాఠశాలల్లో కానరాని కోడిగుడ్డు.. హాస్టళ్లలో మెనూపై తీవ్ర ప్రభావం
- ధరల పెరుగుదల సాకుతో వార్డెన్ల ఇష్టారాజ్యం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో 4,927 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. డ్రాపౌట్స్‌ను తగ్గించడం, పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘మధ్యాహ్న భోజన పథకాన్ని’ ప్రవేశపెట్టారు. హాస్టళ్లలోని విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడకుండా గత ఏడాది మెనూ మార్చారు. అన్నం, సాంబారు వరకే దీన్ని పరిమితం చేయకుండా ఆకుకూరలు, ఇతర కూరగాయలతో కూడిన వంటకాలను కూడా మెనూలో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం కొండెక్కిన కూరగాయల ధరలతో ఇటు మధ్యాహ్న భోజనం, అటు హాస్టళ్లలో ‘మెనూ’ చిక్కిపోయింది.
పోషకాహార విలువల సంగతి పక్కనపెడితే పప్పన్నం కూడా సరిగా పెట్టలేని పరిస్థితి. ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 40 రూపాయలకు తక్కువ లేకుండా ఉన్నాయి. దీంతో రుచికరమైన ఆహారం అందించడం ఏజెన్సీలకు, వార్డెన్లకు ఇబ్బందిగా మారింది. ధరల పెరుగుదల సాకుతో ఇంకొంతమంది వార్డెన్లు పూర్తిగా కోడిగుడ్లతో పాటు కాయగూరలలో కూడా కోత పెడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి పచ్చడి మెతుకులతోనే సరిపెడుతున్నారు. స్కూళ్లలో వారానికి రెండుకోడిగుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల ఒక్కటీ ఇవ్వట్లేదు. హాస్టళ్లలోనూ నెలన్నరగా మెనూలో ‘గుడ్డు’ కన్పించడం లేదు.
ధరలు తగ్గాలి.. లేదా భత్యం పెంచాలి
కూరగాయల ధరలు తగ్గడం లేదా ఏజె న్సీలకు ఇచ్చే భత్యం పెంపుదలతోనే భోజన పథకానికి తంటాలు తప్పుతాయి. గత విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న కురగాయల ధరలకు ఇప్పటికీ పెరుగుదల 70 శాతానికి పైగా ఉంది.
గతంలో కందిపప్పు కిలో 53 రూపాయలు ఉంటే ఇప్పుడు 70-80 రూపాయలకు చేరింది. మొన్నటి వరకూ డజన్ కోడిగుడ్లు 34 రూపాయలు ఉంటే ప్రస్తుతం 48 రూపాయలకు చేరాయి. అదే విధంగా టమోటా ధరలు రెండు నెలలుగా ఆకాశం దిగని పరిస్థితి.
{పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్ల్లో చదివే విద్యార్థులకు రోజుకు 4 రూపాయలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రోజుకు 4.65 రూపాయల చొప్పున భోజనానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో సింగిల్ టీ కూడా రాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిధులతో 100 గ్రాముల అన్నం, 150 గ్రాముల కూరలను ఏజెన్సీలు వడ్డించాలి. వారానికి రెండు కోడిగుడ్లు, అరటికాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన వంటకా లు అందించాలి. అయితే కోడిగుడ్డు ధర 4 రూపాయలు పైబడి ఉంది. అ డబ్బుతోనే విద్యార్థి రోజుకు అవసరమయ్యే భోజనం అందించాలంటే ఎలా? అని ఏజెన్సీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
దీనికితోడు బకాయిల బరువు కూడా ఏజెన్సీల నిర్వాహకులను బాధకు గురిచేస్తోంది.
భోజన పథకం అమలుకు వంటగ్యాస్ ఇవ్వాల్సి ఉండగా కొన్ని మండలాల్లో నేటికీ ఇవ్వలేదు. ఉన్న మండలాల్లో స బ్సిడీ సిలిండర్లు ఏడాదికి 11 మాత్రమే ఇస్తారు. సిలిండ రు 15రోజులు కూడా రావడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. దీనికి తోడు వంట సామగ్రి కూడా ఏజెన్సీలు బయట నుంచి అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ఉన్నత పాఠశాలల్లో వందల మంది విద్యార్థులుంటారు. వారికి వంట, ఆహారం వడ్డించడానికి ఏజెన్సీల వద్ద సామాన్లు లేవు. ప్రభుత్వమే వాటిని అందించాలని గత కొన్నేళ్లుగా నిర్వాహకులు కోరుతున్నా పట్టించుకోవట్లేదు.
హాస్టళ్లలోనూ అదే పరిస్థితి
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకూ ధరల సెగ తగిలింది. జిల్లాలో 216 హాస్టళ్లలో 17,331 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ శనివారం మినహా తక్కిన అన్ని రోజుల్లో గుడ్లు అందించాలి. రోజూ ఆకు, కాయగూరల పప్పు, సాంబారు అందించాలి. పెరిగిన ధరలతో దాదాపు ఏ సంక్షేమ హాస్టలులో కూడా పూర్తిస్థాయి మెనూ అమలు కావడం లేదు.