
‘తెలుగునాడు’గా మార్చాలి : లగడపాటి
విజయవాడ, న్యూస్‌లైన్ : కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఎంత త్వరగా కొత్త రాజధాని ఏర్పాటు జరిగితే అంతే వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాష్ట్రానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు.
జేఎస్పీతో సంబంధం లేదు..
జైసమైక్యాంధ్ర పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రజల్లోని ఐక్యత అని, పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తనకు పునర్జన్మ మీద నమ్మకం లేదని, మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తాను భావించటం లేదన్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గానీ, ఒక పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో గానీ తాను సర్వే ఫలితాలు ప్రకటించటం లేదన్నారు. కొందరు తన పేరు ఉపయోగించుకుని దొంగ సర్వేలు చేస్తున్నారని, దీంతో తాను సర్వేలు చేయటం ప్రస్తుతానికి నిలిపివేశానని చెప్పారు.
గెలుపోటములపై పోలింగ్ శాతం ప్రభావం
న్నికల్లో ట్రెండ్ అనేది పోలింగ్ సరళిని ఆధారంగా మారుతుందన్నారు. పోలింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ట్రెండ్‌ను సృష్టిస్తుందన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై తాను ఒక అభిప్రాయానికి వస్తానన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే ఇంచుమించు అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు.