విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ మృతి
కవలగొయ్యి (రాజమండ్రి రూరల్) :విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం స్తంభం ఎక్కిన లైన్‌మన్ విద్యుత్ షాక్‌కు గురై మరణించిన సంఘటన శనివారం ఉదయం కవలగొయ్యి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం... రాజమండ్రి లాలాచెరువు గాంధీపురం-4 ప్రాంతానికి చెందిన కాదా శ్రీనివాసరావు(45) శాటిలైట్ సిటి విద్యుత్‌సబ్‌స్టేషన్(డి-7సెక్షన్)పరిధిలో కవలగొయ్యి, పిడింగొయ్యి గ్రామాల లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేదని కవలగొయ్యి గ్రామానికి చెందిన రైతు మరుకుర్తి వెంకట్రావు లైన్‌మెన్ శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు.
దీంతో ఆయన సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి ప్రైవేటు ఎలక్ట్రీషియన్ రామారావును తీసుకుని కవలగొయ్యి వచ్చారు. గ్రామంలోని లా కళాశాల ఎదురుగా ఉన్న 9.1పోల్‌పై జంపర్‌కట్ అయింది. దీంతో వెంటనే లాలాచెరువు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఎల్‌సీ(విద్యుత్ సరఫరా నిలపమని)తీసుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తరువాతే శ్రీనివాస్ స్తంభం ఎక్కి బాగుచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌షాక్ తగిలి మంటలు వ్యాపించి, అతను కిందపడిపోయాడు. వెంటనే అతడిని ఆటోలో రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు అతడిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శ్రీనివాస్ మృతిచెందాడు. ఈమేరకు బొమ్మూరు ఎస్సై జాన్‌మియా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషాదంలో కుటుంబ సభ్యులు
విషయం తెలియగానే రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి కాదాశ్రీనివాసరావు భార్య కృష్ణవేణి, అతడి కుమార్తె, కుటుంబసభ్యులు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే ఏపీఈపీడీసీఎల్(ఆపరేషన్) డీఈఈ శ్యాంబాబు, ఏడీఈ నక్కపల్లి శామ్యూల్, ఏఈలు షిలార్, ప్రసాద్, శ్రీనివాస్, ఉద్యోగులు అధికసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తోటి కార్మికుడు విధి నిర్వహణలో మృత్యువాతపడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు నెలల క్రితమే అపార్టుమెంట్‌లో ఫ్లాట్ తీసుకుని గృహప్రవేశం చేసిన శ్రీనివాసరావు ఇలా మృత్యువు కబలిస్తుందని అనుకోలేదని ఆవేదన చెందారు.