► వచ్చే నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో సర్వే
► ఇంకా సేకరించాల్సినది 345ఎకరాలు మాత్రమే
► పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న రెవెన్యూ అధికారులు
భోగాపురం : గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు దాదా పు భూములు సిద్ధమయ్యాయి. సర్వే పనుల్లో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చినెలలో పూర్తి స్థాయిలో భూసేకరణ చేసేందుకు అవసరమైన పనులు ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తుది నోటిఫికేషన్ ప్రకారం 2545 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఒప్పటికి 2200 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా సేకరించాల్సింది కేవలం 345ఎకరాలే. దానికి సంబంధించిన రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కావాలని కోరుతూ హైకోర్టులో స్టే తెచ్చుకోవడంవల్ల ఈ జాప్యం ఏర్పడింది, అయితే వారిని కూడా అంగీకరింపజేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు.
చేతులు మారిన డి–పట్టా భూముల స్వాధీనం: ఎయిర్‌పోర్టు ప్లానులో గతంలో ఇచ్చిన డి–పట్టాభూములు ఎక్కువగా చేతులు మారిన విషయాన్ని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ప్లానులో ఇలా 215 ఎకరాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. దానిలో 175ఎకరాలకు సంబంధించిన రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు 3నెలల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా ఆర్‌డీఓ ఎదుట అప్పీలు చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకూ 50ఎకరాలకు సంబంధించిన రైతులు అప్పీలు చేసుకున్నారు. ఇంకా 40 ఎకరాలకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కవులవాడ రెవెన్యూలో 120 ఎకరాలు, కంచేరు రెవెన్యూలో 8, గూడెపువలస రెవెన్యూలో 50, రావాడ రెవెన్యూలో 30 ఎకరాలు డి పట్టా భూములు చేతులు మారాయని తహసీల్దారు అధికారికంగా తెలిపా రు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు.
పునరావాస స్థల అభివృద్ధి బాధ్యత వుడాకు: ఎయిర్‌పోర్టు ప్లానులో మరడపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట గ్రామాలను తరలించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో 376 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. వీరందరికీ చెరుకుపల్లి వద్ద నివాస యోగ్యమైన స్థలాన్ని అధికారులు గుర్తించి దానిని అభివృద్ధి చేసే బాధ్యత వుడాకు అప్పగించారు. త్వరలో పునరావాస పనులను చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఆక్రమిత భూముల సర్వే: ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూముల్లో డి పట్టాలు లేకుండా సాగుచేస్తున్న భూమి 40 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ భూముల్ని ఎవరు సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా పక్కాగా సర్వే చేపట్టే పనిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దారు డి.లక్ష్మారెడ్డి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు తలొంచినా వారిపై వేటు తప్పదని గట్టిగా హెచ్చరించారు.