కానుకకు దారేది
గుంటూరు సిటీ: చంద్రన్న సం‘క్రాంతి’ కానుక మసకబారేలా కనిపిస్తోంది. పండుగకు ఇంకా ఏడు రోజులే సమయం ఉన్నా, ఇప్పటికీ సరుకులు రాలేదు. సరుకులు ఉచితంగా రవాణా చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కారణంగా కాంట్రాక్టర్ల కినుకతో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పథకాన్ని బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పేదలకు సంక్రాంతి నాటికి సరుకులందే మార్గం కనిపించడం లేదు.
సంక్రాంతికి రాష్ట్రంలోని పేదలందరికీ కానుక అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి సైతం బాలారిష్టాలు తప్పలేదు. ఆయన మనోభీష్టం మేరకు ఉచితంగా ఆరు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజల దరి చేర్చాలని కూడా భావించింది.
ఈ మేరకు పది రోజుల ముందే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 5వ తేదీ నాటికి ఆయా సరుకులన్నీ చౌక డిపోలకు చేరాల్సి ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ ఉదాశీనం, ప్రభుత్వాధికారుల అత్యుత్సాహం కారణంగా ఆరవ తేదీ నాటికి కూడా వాటి జాడ లేదు.
రూ. 230 విలువ గల కిలో గోధుమ పిండి, కిలో శనగలు, అర కిలో చొప్పున కందిపప్పు, బెల్లం, పామాయిల్, వంద గ్రాముల నెయ్యి ఉచితంగా తెల్ల రేషన్‌కార్డుదారులకు అందించాల్సి ఉంది.
ఈ నెల 14వ తేదీ లోపు లబ్ధిదారుల ఇళ్లకు సరుకులు చేరితేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరినట్లు లెక్క. జిల్లాలో 12,72,390 తెల్ల కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 2,173 చౌక డిపోల ద్వారా సంక్రాంతి కానుక చేరాల్సి ఉంది.
ఉచితంగా సరుకులను రవాణా చేయాలన్న అధికారుల ఆదేశంతో కాంట్రాక్టర్లు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానుకూలంగా వ్యవహరిస్తే తప్ప సంక్రాంతి నాటికి చంద్రన్న కానుక పేదలకు అందే సూచనలు దాదాపు లేనట్లేనని పలువురు చౌకడిపో డీలర్లు చెబుతున్నారు.