
లోకేష్ మాట వినకపోతే వేటే..!
ఏపీ సీఎం తనయుడి కనుసన్నల్లో అధికారుల బదిలీలు
నచ్చని వారిని అప్రాధాన్య శాఖలకు పంపిస్తున్న వైనం
హైదరాబాద్: తమ కనుసన్నల్లో నడవక, చెప్పినట్టుగా చేయని అధికారులపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేస్తోంది. ఈ బదిలీలన్నీ సీఎం చంద్రబాబు కుమారుడి ఆదేశాల మేరకే జరుగుతున్నాయనే మాట అధికార యంత్రాం గంలో బలంగా వినిపిస్తోంది. ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్నదీ లోకేష్ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. తమకిష్టమైన వారికి, ఇష్టమైన శాఖల్లో పోస్టింగ్‌లిప్పించుకొంటున్నాడు లోకేష్.
మొన్న గిరిధర్‌పై, నిన్న రమణారెడ్డిపై...
మాట వినలేదన్న కారణంగా మొన్న ఏపీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా సమాచారశాఖ కమిషనర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రమణారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసుకు చెందిన రమణారెడ్డి రాష్ట్ర విభజన అనంతరం సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుంచి మొన్నటి పుష్కరాల్లో ప్రచారం వరకూ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు ఏర్పాటు చేశారు. రమణారెడ్డి ప్రొటోకాల్ బాధ్యతలే నిర్వహిస్తుండగా పనితీరు గుర్తించి సమాచార శాఖ కమిషనర్ బాధ్యతల్నీ అదనంగా సీఎం అప్పగించారు. సీఎం పర్యటనలకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతోపాటు సీఎం కార్యాలయ సోకులకు కోట్ల రూపాయలు మంజూరు చేయడంలో రమణారెడ్డి ప్రభుత్వ పెద్దల మాటకు మరోమాట చెప్పకుండా పనిచేశారు. అయితే ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించడం తెలిసిందే. ఆ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఏపీ భవన్‌లో వసతి సౌకర్యం కల్పించారనే కారణంగా రమణారెడ్డిని మాతృసంస్థకు పంపించాలంటూ లోకేష్ ఆదేశించడంతో అది జరిగిపోయింది. ఈ పరిణామంపై పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకైనా ఏపీ భవన్‌లో వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రొటోకాల్ ప్రత్యేక అధికారికి ఉంటుందని, గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు సమన్యాయం పేరుతో ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో 90 మందికి వసతి కల్పించిందీ ఇదే రమణారెడ్డేనని వారు పేర్కొన్నారు.
రమణారెడ్డిని ఇండియన్ రైల్వేస్‌కు తిరిగి పంపిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారమే ఆయన ఏపీ సర్వీసు నుంచి రిలీవ్ అయి వెళ్లిపోయారు. సోమవారం ఢిల్లీలో ఇండియన్ రైల్వే బోర్డుకు రిపోర్టు చేయనున్నారు. మరోవైపు ఢిల్లీలో పెట్రోలియంశాఖలో పనిచేస్తున్న ఎ.గిరిధర్‌ను కూడా సీఎం తన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఏపీ మున్సిపల్ ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ రాజధాని విషయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడానికి ఇష్టపడక సెలవుపై వెళ్లారు. ఇదే అదనుగా ఆయన్ను సచి వాలయంలో కాకుండా ఎలాంటి పనిలేని ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించడాన్నీ టీడీపీ నేతలు, ఉద్యోగులు తప్పుబడుతున్నారు.