జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం రిజర్వేషన్ ఖరారైంది. ఈ కుర్చీని జనరల్ అభ్యర్థికి కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జెడ్పీ చైర్మన్ పదవి బీసీ (మహిళ) లకు కేటాయించే అవకాశముందని ప్రచారం జరిగినప్పటికీ, చివరి నిమిషంలో రిజర్వేషన్ తారుమారైంది.
ఈ అనూహ్య పరిణామంతో బలమైన సామాజికవర్గాలు ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రిజర్వేషన్ల కేటాయింపుతో జాతకాలు మారిపోవడం, అనుకూల సీట్లు ఇతర వర్గాలకు ఖరారు కావడంతో ఉసూరుమన్న ఆయా వర్గాలు తాజా పరిణామాలతో సురక్షిత మండలాల అన్వేషణలో మునిగిపోయాయి.
వాస్తవానికి జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్ అభ్యర్థులకే కేటాయించినా...ఏ సామాజికవర్గమైనా పోటీ చేసే అవకాశం కలిగింది. 2006 ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ కుర్చీ జనరల్ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి బీసీలకు కేటాయించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరా రు చేస్తే మన జిల్లా బీసీలకే దక్కేది. అంతేకాకుండా తెలంగాణలోని హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలు ఏదో ఒక కేటగిరీకి రిజర్వ్ అవుతుండడం.. జనరల్‌గా ఒక జిల్లాకు అవకాశం రావడంలేదని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం తమకు తలనొప్పిగా పరిణమిస్తుందని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ యూనిట్‌గా రిజర్వేషన్ ఖ రారు చేయడంతో రంగారెడ్డి జిల్లాకు జనరల్ కేటగిరీ లభించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం...1995 నుంచి ఇప్పటివరకు కేటాయించిన రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుంది. తాజాగా జెడ్పీ సీటు జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఆశావహుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
అయ్యో పాపం!
ఆఖరి నిమిషంలో జెడ్పీ చైర్మన్‌గిరీ రిజర్వేషన్ అనుకూలించినా.. జిల్లా ప్రాదేశిక స్థానాల రిజర్వేషన్లు స్థానికనేతలకు మింగుడు పడటంలేదు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసించే బలమైన సామాజికవర్గం నాయకులకు తాజా పరిణామాలు ఆశనిపాతం గా మారాయి. గత ఎన్నికల్లో రిజర్వ్‌డ్ స్థానాల్లో ఈ సారైనా అవకాశం దక్కకపోతుందా అని ఎదురుచూసిన నేతలకు నిరాశే మిగిలింది. మం డలం/జిల్లాలో చక్రం తిప్పాలని భావించిన పలువురు ఆశావహులకు రిజర్వేషన్ల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.
తమ గెలుపునకు సురక్షిత గ్రామం/ మండలం నుంచి పోటీ చేద్దామని వ్యూహరచన చేస్తున్నప్పటికీ, స్థానికంగా సహకారం అందుతుందో లేదోననే భయం వారిని వెంటాడుతోంది. దీనికితోడు వేరొక సీటు నుంచి బరిలోకి దిగితే వ్యయం తడిసిమోపెడవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జెడ్పీ సీటు జనరల్‌కు కేటాయించినా.. స్థానికంగా పోటీచేసే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు ప్రాదేశిక పోరు ఎమ్మెల్యే అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆర్థిక భారాన్ని ఊహించుకొని తల బాదుకుంటున్నారు. ధన ప్రవాహంతో కూడుకున్న ఎన్నికలు కావడం.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అతిత్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ గెలుపోటములను ప్రభావితం చేస్తాయని బెంగ పడుతున్నారు.