మాదిగలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ....
భామిని(శ్రీకాకుళం): మాదిగలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు, పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీని కోసం మాదిగలు, ఇతర ఉపకులాలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
వర్గీకరణ హామీని గాలికొదిలినందుకు నిరసనగా ఈనెల10న చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెని ముట్టడిస్తామని మంద కృష్ణమాదిగ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలిరావాలన్నారు. ఏప్రిల్10న మహాసంగ్రామం ఉద్యమం చేపడతామన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాల పేరిట చేసే బెదిరింపులను బేఖాతరు చేయాలన్నారు. తునిలో కాపుల ఉద్యమంలో కోట్లాది రూపాయిల ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయని అలాగే 50 వరకూ కేసులు నమోదు చేసినా ఏ ఒక్కరీని అరెస్టు చేయలేదన్నారు. శాంతియుతంగా మాదిగలు చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూడటం తగదన్నారు.