
ప్రజా సంకల్పయాత్ర బృందం: హత్యాయత్నం జరిగిన తరువాత మొట్టమొదటి సారిగా పార్వతీపురంలో జరిగిన ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా నీకాన్ని చూసి ఓర్వలేక జిల్లా మంత్రి సుజయ్ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం దత్తివానివలస వద్ద ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. సీతానగరం ప్రాంతంలో ఉన్న ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై పలుమార్లు ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 14 మండలాల్లో చెరకు రైతులుండగా.. వారికి యాజమాన్యం బకాయిలు చెల్లించాలని చెబుతుంటే..
బకాయిలు చెల్లించేశారంటూ రైతులను అడగమనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి సుజయ్ అదే మాటకు కట్టుబడి రోజు, సమయం చెబితే బకా యిలు రావాల్సిన రైతులను తీసుకువచ్చి నిజం నిరూపిస్తామన్నారు. బకాయిలు నిజంగా తీర్చారో లేదో రైతులే చెబుతారన్నారు. టీడీపీ పాలనలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయన్నారు. గతంలో సీబీఐ కావాలని చెప్పిన టీడీపీ నాయకులు ఈ రోజు సీబీఐ రాష్ట్రంలో విచారణ జరపకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి కేసుల్లో జగన్ ఇరుక్కున్నారంటూ చెబుతున్న మంత్రి 2014 ఎన్నికల్లో అదే జగన్‌మోహన్‌రెడ్డిని పక్కన పెట్టుకుని బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మీరింకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ–ఫారంతో గెలిచిన పదవిలోనే కొనసాగుతున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణాపాఠం చెబుతారన్నారు.