
పరిశ్రమల శాఖ అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం ఆరు ఓడరేవుల నిర్మాణానికి సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మొదటి దశలో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు ఓడరేవులను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం తన నివాసంలో రాష్ట్రంలో ఓడరేవుల పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి అందుబాటులో ఉన్నందున వీలైనంత వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. మిగిలిన ఓడరేవులకు కూడా అవసరమైన భూ సమీకరణను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వచ్చే జూన్ నాటికి రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని చెప్పారు. కేంద్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఒక ఓడరేవును కేంద్రం నిర్మించాల్సి ఉందని, ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సంక్షేమానికే ప్రాధాన్యత
సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోమారు విస్పష్టంగా చెప్పారు. తొలి ప్రాధాన్యత నవరత్నాలు, నాడు–నేడు అని, తర్వాత ప్రతి ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది రెండో ప్రాధాన్యత అని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు తీసుకెళ్లే కాల్వల విస్తరణ, పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడ నుంచి బనకచర్లకు గోదావరి జలాలు తరలింపు ప్రాధాన్యత కార్యక్రమాలుగా వివరించారు. ప్రతి జిల్లాకు తాగునీటిని అందించే వాటర్ గ్రిడ్ మరో ప్రాధాన్యతని, ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో స్థిరత్వం ఉంటుందని, అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుందని చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని చెప్పారు.
సబ్సిడీ బదులు విద్యుత్ ఉత్పత్తి చేస్తే..
విద్యుత్ సంస్కరణల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10,000 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామని, దాని బదులు రాష్ట్ర ప్రభుత్వమే 12,000 మెగా వాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ సంస్థలకు ఇస్తే సరిపోతుందన్నారు. ఇందుకోసం సుమారు రూ. 35 వేల కోట్ల నుంచి రూ. 37 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని, అంటే విద్యుత్ సంస్థలకు నాలుగేళ్లలో చెల్లించే సబ్సిడీ డబ్బుతో సొంతంగా విద్యుత్ సమకూర్చుకోవచ్చని, ఈ దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు.