కడప నారాయణ కళాశాలలో ఈనెల 17న నందిని, మనీషా అనే విద్యార్థినులు మృతి చెందడంపై న్యాయ విచారణ జరిపించాలని,మంత్రి నారాయణను
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాలలో ఈనెల 17న నందిని, మనీషా అనే విద్యార్థినులు మృతి చెందడంపై న్యాయ విచారణ జరిపించాలని,మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఐఎస్‌ఎఫ్, ఆర్‌ఎస్‌యూ, ఆర్‌ఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.
సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి సుబ్బరాయుడులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నందిని, మనీషాల మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, అవి హత్యలా? ఆత్మహత్యలా? అన్న విషయాన్ని న్యాయ విచారణ ద్వారా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు ఆయన విద్యా సంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీలో తల్లిదండ్రులనుగానీ, విద్యార్థి సంఘాలనుగానీ ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.