
శిద్దాకు మంత్రి పదవి ఖరారు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ఏర్పడనున్న తెలుగుదేశం ప్రభుత్వంలో దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. బుధవారం తిరుపతిలో జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం అనంతరం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ మేరకు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
గురువారం ఉదయం కూడా చంద్రబాబునాయుడుతో శిద్దా సమావేశమైనట్టు తెలిసింది. ఆయనకు వాణిజ్య శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాఘవరావుకు సీనియర్ నాయకుడిగా తెలుగుదేశంలో గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై వెయ్యికిపైగా ఓట్లతో గెలుపొందినా, సీనియర్ నాయకుడిగా ఆయనకు అవకాశం కల్పించడానికి సిద్ధమైనట్టు తెలిసింది.
దీంతో పాటు అధికారంలో లేని కాలంలో ఆయన పార్టీకి అండగా ఉంటూ వచ్చారు.
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారని పార్టీ నాయకులు తెలిపారు.
ఆయనతో పాటు టీడీపీకి మరో పెద్దదిక్కయిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.
ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.
దీంతో ఆయన ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా కోరుతున్నట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు సుముఖంగా లేరని అంటున్నారు.
జిల్లాకు మరో మంత్రి పదవి కూడా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.
ఒంగోలు దిగ్గజంగా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలిచిన దామచర్ల జనార్దన్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది.
పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి సాంబశివరావు, చంద్రబాబు తనయుడు లోకేష్ ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.
లోకేష్‌కు, ఏలూరి సాంబశివరావుకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో లోకేష్ ఏలూరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.
జనార్దన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్నికల సమయంలో తన సమర్ధతను నిరూపించుకున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమే సముచితమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసు కోవాల్సిన ఆవశ్యకత లేదని అన్నారు. దీనికి చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు.
ఆయనకు ఇస్తే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
దివి శివరాం, కందుల నారాయణరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారని, వారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టాల్సి ఉంటుందని అన్నారు.
ఏది ఏమైనా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం శిరోధార్యమని అన్నారు.