పులివెందుల మండల పరిధిలోని రాయలాపురం బ్రిడ్జి వంకలో బుధవారం పడి గల్లంతైన జాన్ నిషార్ మృతదేహం లభ్యమైంది. శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వినాయక విగ్రహం నిమజ్జనానికి వెళ్లి వస్తూ రాయలాపురం వద్ద కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా జాన్ నిషార్ నీటిలో పడి గల్లంతైన విషయం విదితమే.
పులివెందుల అర్బన్, న్యూస్‌లైన్ : పులివెందుల మండల పరిధిలోని రాయలాపురం బ్రిడ్జి వంకలో బుధవారం పడి గల్లంతైన జాన్ నిషార్ మృతదేహం లభ్యమైంది. శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వినాయక విగ్రహం నిమజ్జనానికి వెళ్లి వస్తూ రాయలాపురం వద్ద కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా జాన్ నిషార్ నీటిలో పడి గల్లంతైన విషయం విదితమే. అతని ఆచూకీ కోసం గురువారం సోమశిల ప్రాజెక్టు నుంచి ముగ్గురు గజ ఈతగాళ్లను పిలిపించారు.
శుక్రవారం రాయలాపురం, తుమ్మలపల్లె గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. బ్రిడ్జి సమీపంలో వంకలో జాన్ నిషార్ మృతదేహం లభ్యమైనట్లు సీఐ భాస్కర్ తెలిపారు. దీంతో మృతదేహానికి పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజుల తర్వాత జాన్ నిషార్ మృతదేహం లభ్యం కావడంతో జయమ్మ కాలనీ వాసులు అధిక సంఖ్యలో ఆసుపత్రి వద్ద గుమికూడారు. జాన్ నిషార్‌కు భార్య, పిల్లలు ఆసియా, ఆసిఫా, ఆర్షియ ఉన్నారు. మృతదేహం లభ్యం కావడంతో భార్య,బంధువులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ హరినాథబాబు, సీఐ భాస్కర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఎర్రగుంట్ల: వరద ప్రవాహంలో గల్లంతైన దాసరి రామలక్షుమ్మ(62) మృతదేహాన్ని శుక్రవారం కలమల్ల పోలీసులు గుర్తించారు. తహశీల్దార్ ఎస్‌ఎం ఖాసీం, కలమల్ల ఎస్‌ఐ కాశయ్య సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కృష్ణనగర్ కాలనీ నుంచి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో చీనీ తోట సమీపాన మృత దేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఎర్రగుంట్లలోని శ్రీనగర్ కాలనీకి చెందిన దాసరి రామలక్షుమ్మ రెండు రోజుల కిందట కడప రిమ్స్‌లో చూపించుకుని కృష్ణనగర్‌లో ఉన్న తన అన్న రాముడు ఇంటి వద్ద కొన్ని రోజులు ఉండటానికి వచ్చింది. అనంతరం వరద బీభత్సం రావడంతో దాసరి రామలక్షుమ్మ మృత్యవాత పడిం ది. మృతురాలి వదిన రామసుబ్బమ్మ కూడ నీటి ప్రవాహ తాకిడికి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె కలరు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కాశయ్య తెలిపారు.
కేసీ కాలువలో...
చెన్నూరు: చెన్నూరులోని సరస్వతీనగర్ సమీపంలో కేసీ కాలువలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. పొలం పనులు చేసుకొని వెళ్లే కూలీలు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ రాజగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. సుమారు 60 ఏళ్లు ఉండవచ్చని, చేతిలో సంచి బట్టలను చూసి యాచకురాలిగా భావిస్తున్నారు. శవ పరీక్షను రిమ్స్ వైద్యులచే అక్కడే చేయించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.