
అడ్డుకుంటే అంతు చూస్తాం: జగ్గారెడ్డి
సంగారెడ్డి : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఈ నెల 13న రచ్చబండలో పాల్గొనేందుకు మెదక్ జిల్లా రానున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాలని చూస్తే టీఆర్ఎస్ నాయకుల అంతు చూస్తామని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఆయన నిన్న సంగారెడ్డిలో విలేకర్లతో మాట్లాడుతూ రచ్చబండకు సీఎంను ఆహ్వానించిన వారు తెలంగాణ ద్రోహులంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ సైతం సీఎంను తన నియోజకవర్గంలో పర్యటించాల్సిందిగా కోరారని గుర్తు చేశారు. అప్పుడు వారు కూడా తెలంగాణ ద్రోహులేనా అని ప్రశ్నించారు. 'తెలంగాణ టీఆర్ఎస్ జాగీరా, హరీష్ రావు అబ్బ సొత్తా... మీ బాగోతం ఎవరికి తెలియదు....' అంటూ నిప్పులు చెరిగారు. రచ్చబండ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులను ఆహ్వానించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.