
విజయనగరం : ప్రజా సంకల్పయాత్ర బృందం: నాలుగున్నరేళ్ల టీడీపీ రాక్షస పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత నెలకొందని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ క్రాస్ వద్ద సోమవారం ఆమె మాట్లాడుతూ, సంక్షేమ పథకాల కోసం అర్హులైన పేదలు కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ల కోసం ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంలో ఉన్నారన్నారు. తిత్లీ తుఫాన్ వల్ల నియోజకవర్గ పరిధిలోని పలువురు అరటి రైతులు నష్టపోయారన్నారు.
అయితే నాలుగేళ్ల కిందట హుద్‌హుద్ సమయంలో ఇచ్చిన పరిహారాన్నే ఇప్పుడు ఇవ్వడం తగదని తెలిపారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన పోయిన నేపథ్యంలో పరిహారం పెంచాల్సిన అవసరం లేదా అనిప్రశ్నించారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు 11 నెలల తర్వాత పరిహారం అందించిన ప్రభుత్వం... ప్రజా సంకల్పయాత్ర కురుపాం నియోజకవర్గంలోకి వస్తుందనే విషయం తెలుసుకుని టీడీపీ నాయకులు హడావిడిగా పరిహారం అందించారన్నారు.
ఆదుకోవాలయ్యా...
నా భర్త సూరయ్య మూడేళ్ల కిందట కూలి పనికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై అవిటివాడిగా మారాడు. నేనే కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నా కొడుకు గౌరీశంకర్ బీఈడీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేసి ఆదుకోవాలని జగన్‌బాబును కోరాను.– చౌడువాడ పద్మ, నందివానివలస
పరిహారం ఊసే లేదు...
మాది నందివలస. ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలుంటున్నాయి. 35 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మమ్మల్ని తోటపల్లి బ్యారేజీ నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇంతవరకు మాకు ఎటువంటి పరిహారం అందలేదు. ఎన్నిసార్లు వినతులిచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాను.– సామంతుల బుజ్జి
నందివలస ఎస్సీ కాలనీ మోసపోయాం...
చంద్రబాబును నమ్మి మోసపోయాం. నేను, నా భర్త ముసలి వాళ్లమయ్యాం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నాడు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మాం. ఎక్కడా ఉద్యోగాలు తీయలేదు. కనీసం రెండు వేల రూపాయలు ఇస్తామన్నాడు. ఇంతవరకు ఒక్క పైసా కూడా నా కొడుక్కి ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మాలాంటి వారిని ఆదుకోవాలి.– సామంతుల నారాయణమ్మ,నందివానివలస