
అడుగడుగునా పోలీసులు, సీసీ కెమెరాలు
వెలగపూడిలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో రాజధాని, చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
తాడేపల్లి (అమరావతి): వెలగపూడిలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో రాజధాని, చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శనివారం నాటికే వివిధ ప్రాంతాల నుంచి 1,500 మంది పోలీసులను తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి, పెదకూరపాడు మండలాల్లో మోహరించారు. సమావేశాలు కొత్త రాజధానిలో నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ మొండి వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతాయనే భయాందోళనలతోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్గాలకు చెందిన నాయకులు ఇప్పటికే తమ సమస్యలపై పలుసార్లు విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసు వద్ద ధర్నాలు నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సచివాలయానికి 20 కిలోమీటర్ల దూరంలోనే వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పికెటింగ్‌లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాత్రి- పగలు షిప్టుల వారీగా పోలీసులు డ్యూటీలు నిర్వహించనున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 15 చోట్ల ప్రత్యేక టెంట్లు ఏర్పాటు ఏర్పాటు చేసి, ఒక్కో చోట 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరికి సాయంగా ఒక్కొక్క చోట 70 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేసి, అప్రమత్తంగా ఉంచారు.
వీటికి అదనంగా గుంటూరు జిల్లా అర్భన్, రూరల్ పరిధిలో సచివాలయానికి వేళ్లే రహదార్లలో 300 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ఫుటేజిలను నేరుగా గుంటూరు ఎస్పీ కార్యాలయంలో చూసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు, రాజధాని పరిధిలో పైలట్ వాహనాలలో సంచరించే వారికి జీపీఎస్ ఫోన్లు అందజేసి, నిరంతరం వాటిని పర్యవేక్షించేందుకు గుంటూరులో ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సిబ్బంది ఎప్పటికప్పుడు, ఎక్కడనుండి ఎక్కడకు ప్రయాణిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారనే విషయాలు కూడా క్షుణ్ణంగా దీనిలో తెలుస్తుందని విశ్వసనీయ సమాచారం.