మాకు ఆంగ్లమాద్యమం కావాలని కోరుతూ ప్లకార్డులు చూపుతున్న పిల్లలతో ఎమ్మెల్యే
సాక్షి, నగరి : చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పిల్లలు మాత్రమే కాన్వెంట్‌లో చదవాలా? పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవకూడదా అని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా ప్రశ్నించారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక పీసీఎన్ ఉన్నత పాఠశాలలో నాలుగు అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు భాషను చంపేస్తున్నారంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని, తెలుగు భాషపై అంతటి ప్రేమ ఉన్న వారు తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో ఎందుకు చదివించడం లేదని నిలదీశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ఎందుకు తొలగించలేదో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. భాష వేరు బోధన వేరు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
తల్లిభాష ఎప్పటికీ మనతోనే ఉంటుందని, దానిని ఎవరూ మరవరని గుర్తు చేశారు. తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలు పూర్తి స్థాయిలో ఆంగ్లం మాట్లాడలేక కెరీర్‌లో వెనుకబడుతున్నారని వివరించారు. అందుకే తల్లిదండ్రులు అప్పుచేసి తమ పిల్లలను ప్రైవే టు పాఠశాలలకు పంపుతున్నారని పేర్కొన్నా రు. ప్రతి ఒక్కరూ ఇంగ్లిషు చదివి ఉన్నత శిఖరాలు చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ చంద్రబాబులా ఆంగ్లం మాట్లాడి ఎవరూ పరువు తీయకూడదనే ఈ ప్రయత్నమన్నారు. విద్యార్థుల మీద ప్రేమతో, అభిమానంతో, ఆశతో నాడు–నేడు, అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం తదితర వినూత్న పథకాలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయన్నారు.
తన పిల్లల్లా అందరూ చదువుకోవాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, అందరూ ఆంగ్ల మాద్యమాన్ని చక్కగా చదివి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీదేవి, తహసీల్దార్ బాబు, ఎంపీడీవో రామచంద్ర, ప్రధానోపాధ్యాయులు సునీత, నమశ్శివాయం, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment