సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి రంగన్న మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చాలా వరకు కనీస వసతులు కూడా లేవన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. హెచ్‌డబ్ల్యూఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 66 వసతి గృహాల్లో వంట మనుషులు కూడా లేకపోవడంతో విద్యార్థులే వంట చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఖాళీగా ఉన్న హెచ్‌డబ్ల్యూఓ, వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సోమన్న, మహేంద్ర, నాగరాజు, సంపత్, హనుమంతు, విద్యార్థులు పాల్గొన్నారు.