గద్వాల టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే అన్న వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిలబెట్టుకుందని మంత్రి డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చినమాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమంతో తెలంగాణ ఏర్పా టు ఆగుతుందన్న అనుమానాలు అవసరం లేదని, రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. ఆదివారం స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విజ యోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం నేడు నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అందుకు బహుమతిగా 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జిల్లాలో కొంతమంది స్వార్థపూరిత నాయకులు తెలంగాణ కోసం కాకుండా డీకే. అరుణను ఏకైక లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూనే, జిల్లా అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. గద్వాల ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతోనే జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరికీ ఆత్మకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా శాంతి చేకూరుతుందన్నారు. ఆరు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతున్నా అన్ని వర్గాల ప్రజల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు.
గద్వాలను జిల్లా చేసేందుకు కృషి
గద్వాల నియోజకవర్గంలో భారీ తాగునీటి పథకంతో పాటు, ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నీరందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెంటనే గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే అన్ని వసతులు, సౌకర్యాలు, వనరులు గద్వాల ప్రాంతంలో ఉన్నాయని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా డీకే. అరుణను నియమించే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మహాంకాళి శ్రీనివాసులు, బీఎస్ కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రామచంద్రారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఆర్. శ్రీనివాసులు, బండల వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై అనుమానాలొద్దు
Published Mon, Aug 5 2013 4:29 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement