
ఇంత నిర్లక్ష్యమా..?
ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజ లకు, జంతువులకు ప్రాణ సంకటంగా మా రింది. నిత్యం ప్రజలు సంచరించే ప్రదేశాల్లో విద్యుత్ తీగలు వేలాడుతుండడం, ట్రాన్స్‌పార్మర్లకు ఫెన్సింగ్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటన లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, భారీగా పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి.
జనసంచార ప్రదేశాల్లో ప్రమాదకరంగా..
నిత్యం ప్రజలు సంచరించే ప్రదేశాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు, దేవాలయాలు, కూరగాయల మార్కెట్‌లు, ఇతర జనావాస ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం డివిజన్ పరిధిలో 9,616, సత్తుపల్లిలో 9,805, భద్రాచలం 3,540, కొత్తగూడెం 4, 424 .. ఇలా జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో 27,384 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఇందులో సుమారు 14 వేలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించినవి కాగా, 13 వేలకు పైగా గృహ, వ్యాపార, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేవి. అయితే ఇందులో సుమారు 2 వేలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్ల రక్షణకు ఫెన్సింగ్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల వివిధ పథకాల ద్వారా విద్యుత్ లైన్లు మరమ్మతుతో పాటు లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి ప్రాంతాల్లో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు వేశారు. అయితే వీటి నిర్మాణం కోసం వేసిన టెండర్లలో ఫెన్సింగ్‌కు అదనపు డబ్బులు ఇవ్వలేదనే నెపంతో కాంట్రాక్టర్లు ట్రాన్స్‌ఫార్మర్లు నిర్మించి ఇష్టానుసారంగా వదిలేశారు. దీంతో వైర్లు కిందకు వేలాడపడుతుండడం, బోర్డులు పగిలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని ట్రాన్స్‌ఫార్మర్లు చెట్ల మధ్యలో ఉండి దగ్గరకు వెళ్లేంతవరకు కన్పించడం లేదు. లైన్లు వేయడానికి, ఎల్సీ తీసుకోవడానికి నిత్యం ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లే విద్యుత్ అధికారులు, సిబ్బంది.. అవి ప్రమాదకరంగా ఉన్నాయనే విషయం గమనిస్తున్నారే తప్ప, వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లను గుర్తించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పలువురు కోరుతున్నారు.
పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోంది
రోడ్డు పక్కన, పాఠశాలల దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాద కరంగా ఉన్నాయి. పిల్లలు ఆడకుంటూ వెళ్లి ఏ వైరు ముట్టుకుంటారోనని భయమేస్తోంది. అందుకోసం వారిని బయటకు పంపడం లేదు. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచె వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. మా వీధితోపాటు ఖమ్మం ఇందిరానగర్ మసీద్ ప్రాంతంలో వైర్లు వేలాడుతూ ప్రమాదంగా మారాయి.
- రామకృష్ణ, ఖమ్మం మామిళ్లగూడెం
ఎన్ని సార్లు చెప్పినా కంచె వేయడంలేదు.
మా ఇంటి ముందు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కంచె లేకుండా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరుచూ విద్యుత్ షాక్ వస్తోంది. దీంతో ఈ ప్రాంతం వారంతా భయపడుతున్నారు. గతంలో ప్రమాదాలు జరిగాయి. చిన్నపిల్లలు నడిచి వెళ్లే ప్రాంతం కావడంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్ దాటేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు.
- అంజలి, గృహిణి, బాలాజీనగర్-ఖమ్మం
రక్షణ చర్యలు చేపడతాం
జిల్లాలో పలు ట్రాన్స్‌ఫార్మర్లకు చుట్టూ కంచెలేని విషయం వాస్తవమే. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు అందాయి. అన్ని ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె వేయడం ఇబ్బందే. పాఠశాలలు, మార్కెట్, ఇతర జన సంచార ప్రదేశాల్లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటికి కంచె వేసి రక్షణ కల్పిస్తాం. ఇందుకోసం జిల్లాలోని అన్ని డివిజన్ల అధికారులకు ఆదేశాలు జారీచేశాను. తర్వలో రక్షణ చర్యలు చేపడుతాం.
- తిరుమలరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ