ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు
స్పష్టం చేసిన డీజీపీ సాంబశివరావు
సాక్షి, అమరావతి: ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో అసాంఘిక శక్తులు చొరబడి హింస సృష్టిస్తాయనే సమాచారం ఉన్నందునే అనుమతి ఇవ్వలేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరిలో అరుునా కడపలో అరుునా ఇలాంటి యాత్రలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తూర్పుగోదావరి జిల్లాతోపాటు అన్ని జిల్లాల్లోనూ సెక్షన్ 30 అమల్లో ఉందని, అనుమతి లేకుండా ఎలాంటి పాదయాత్రలు, ఆందోళనలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం తన యాత్రకు ఇంతవరకూ అనుమతి కోరలేదని, ఒకవేళ కోరితే హింస జరగదని.. ఏం జరిగినా తానే బాధ్యత తీసుకుంటానని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగితే చెల్లిస్తానని హామీ పత్రం రాసిస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి దాన్ని పరిశీలిస్తామన్నారు.