సాక్షి, అనంతపురం : విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపౌట్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మధ్యాహ్న భోజన’ పథకం జిల్లాలో చతికిల పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రభుత్వ మెనూ అటకెక్కింది. అధిక శాతం స్కూళ్లలో నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 63 మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును గురువారం ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయం బహిర్గతమైంది. ఇక మంగళవారం, శుక్రవారం విద్యార్థులకు గుడ్డు/అరటిపండు అందించాలన్న నిబంధనను పాటించడం లేదని తెలిసింది.
అటకెక్కిన పౌష్టికాహారం
జిల్లా వ్యాప్తంగా ఉన్న 4107 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. 3,79,078 మంది విద్యార్థులకు గానూ 3,60,124 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఈ పాఠశాలల్లో అనంతపురం పట్టణంలో ఒక పాఠశాలతో కలుపుకుని రూరల్ పరిధిలో దాదాపు 25 పాఠశాలల్లో ఇస్కాన్ ద్వారా భోజనం వడ్డిస్తుండగా.. మిగిలిన పాఠశాలల్లో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న ఏజెన్సీలే భోజనం చేస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి 100 గ్రాముల అన్నం, 20 గ్రాముల పప్పు దినుసులు, 50 గ్రాముల కూరగాయలు, 5 గ్రాములు నూనెతో కూడి న భోజనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు దినుసులు, 75 గ్రాముల కూరగాయలు, 7.05 గ్రాముల నూనెతో కూడుకున్న భోజనాన్ని వడ్డించాల్సి ఉంది. అయితే ఎక్కడా కూడా నిర్వాహకులు ఈ విధమైన భోజనాన్ని అందించడం లేదు.
నీటి వసతి లేక ఇబ్బందులు
మధ్యాహ్న భోజనం అమలౌతున్న పాఠశాలల్లో నీటి వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భోజనం చేసే సమయంలో ముద్ద అడ్డం పడుతుండడంతో విద్యార్థులు నీళ్ల కోసం బోరింగుల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. జిల్లాలో దాదాపు 195 పాఠశాలల్లో నీటి వసతి లేదని అధికారులు చెబుతున్నా వాస్తవానికి 600 పాఠశాలల వరకు నీటి వసతి లేదని తెలుస్తోంది. ఇక పైపులైన్లు, నీటి ట్యాంకులు ఉన్న పాఠశాలల్లో సైతం నీటి కొరత కారణంగా పైపులైన్లు చిలుముపట్టి, ట్యాంకులు ఎండిపోయి దర్శనమనిస్తున్నాయి. విద్యార్థులకు మినరల్ వాటర్ అందజేయాలన్న ఉద్దేశంతో జలనిధి పథకం కింద పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓఆర్ ప్లాంట్లు అప్పుడే మూలనపడిపోయాయి.
సరిపడని నిధులు
గత విద్యా సంవత్సరం వరకు మధ్యాహ్న భోజనానికి మంజూరౌతున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని వంట ఏజెన్సీలు గగ్గోలు పెట్టాయి. ఇందుకు స్పందించిన కిరణ్ ప్రభుత్వం నిధులు పెంచింది. ఈ నిధులకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలకు పొంతన లేకుండా పోయింది. దీనికి తోడు కొన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్లపై వంట చేస్తుండడంతో సిలిండర్ల కొరత వల్ల బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా ఖర్చు చేసిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు వంట ఏజెన్సీలు గత్యంతరం లేక పిల్లలు తినే మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గిస్తూ పిల్లల పొట్టలు కొడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 28న ప్రభుత్వం విడుదల చేసిన జీవోఎంఎస్ నెంబర్ 52 ప్రకారం అయిదో తరగతి వరకు పిల్లలకు రూ.4 మొత్తాన్ని రూ.4.35 గాను, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.5 ఉన్న మొత్తాన్ని రూ.6కు పెంచి చెల్లిస్తున్నారు. 25 మందిలోపు పిల్లలు ఉంటే ఒకరికి, 25కు మించి 50 మందికి లోపు పిల్లలు ఉంటే ఇద్దరికి అలా..ప్రతి 25 మంది పిల్లలకు ఒక ఉద్యోగికి రూ.1000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అయితే మెనూలో మాత్రం ఏ మార్పు లేదు.
అధ్వాన్నం
Published Fri, Dec 13 2013 3:01 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
Advertisement