
రోజంతా భేటీలే భేటీలు.. చర్చలే చర్చలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకోవడం.. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ సమన్లు జారీ చేస్తుందనే వార్తలు రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో మంగళవారం భేటీలు జోరందుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రోజంతా చర్చలు జరుపుతూ తీరికలేకుండా గడిపగా.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలసి నోటుకు ఓటు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ భోంస్లే గవర్నర్ను కలిశారు. మరోవైపు ఉన్నతాధికారులతో సమావేశమైన తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇక ఏపీ మంత్రులు మీడియా సమావేశాల్లో పాల్గొని తెలంగాణ పోలీసుల భద్రత తమకు అవసరం లేదని తామే ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. వరుస భేటీలతో ఏదో జరగబోతోందనే ఊహాగానాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలాగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగాయి. ఈ రోజు ఎవరు ఎవరితో సమావేశమయ్యారంటే..
- ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు సుధీర్ఘ సమావేశం. యనమల, సీఎం రమేష్, సుజనా చౌదనరి, డీజీపీ రాముడు, ఇంటలిజెన్స్ చీఫ్ అనూరాధ
- గవర్నర్తో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భేటీ
- ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం చినరాజప్ప సమావేశం
- మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ
- ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్లో మంత్రుల భేటీ
- తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష
- గవర్నర్తో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బృందం సమావేశం
- సాయంత్రం గవర్నర్తో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సమావేశం
- గవర్నర్ నరసింహన్తో హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంస్లే భేటీ
- తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ
- చంద్రబాబుతో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సమావేశం