- మార్గదర్శకాల కమిటీ చైర్మన్ కమలనాథన్ ఉద్ఘాటన
- రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ సమీక్ష
- హాజరైన కమల్‌నాథన్, సీఎస్ మహంతి, రమేశ్, వెంకటేశం
- ‘స్థానికత’ ఏ ప్రాతిపదికపై తీసుకోవాలనే దానిపై మీమాంస
- మార్గదర్శకాల ఖరారుకు రెండు మూడు వారాల సమయం
ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయి
Published Fri, Mar 14 2014 2:32 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో ఉద్యోగులకు ఆప్షన్లు తప్పనిసరిగా ఉంటాయని రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పా టైన కమిటీ చైర్మన్ కమలనాథన్ స్పష్టంచేశారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాల రూపకల్పనపై కేంద్ర హోంశాఖ గురువారం ఢిల్లీలో సమీక్షించింది. ఈ సమీక్షకు కమలనాథన్‌తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం సభ్యుడు పి.వెంకటేశం హాజరయ్యారు.
భేటీ అనంతరం కమలనాథన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికన ఉండాలి అనే మార్గదర్శక సూత్రాలు ఖరారు చేసేందుకు సమావేశమయ్యాం. ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. దాదాపు 52 వేల మంది ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉంది. జూన్ 2కల్లా ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది...’’ అని చెప్పారు. ‘ఉద్యోగుల పంపిణీలో ఆప్షన్లు ఉంటాయా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘తప్పనిసరిగా ఉంటాయి’ అని తెలి పారు. ‘ఈ విధివిధానాల ఖరారులో ఉద్యోగులతో చర్చలు జరుపుతారా?’ అని అడగ్గా.. ‘అధికారుల సంఘాలతో చర్చిస్తాం’ అని బదులిచ్చారు.
‘స్థానికత’ ప్రాతిపదికపై మల్లగుల్లాలు...
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి ఉద్యోగాలు 72 వేలు ఉండగా.. ఇందులో ఖాళీలు పోను ప్రస్తు తం 54 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిని.. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకుగల ప్రాతిపదికను, మార్గదర్శక సూత్రాలను ఖరారు చేయటంపై సమావేశంలో చర్చిం చారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా చేయాలా? ఉద్యోగ నియామకం సమయంలో ఉన్న అభ్యర్థి ప్రాంతాన్ని బట్టి విభజించాలా? స్థానికతకు ఏ ప్రాతిపదిక తీసుకోవాలి? ఏ ప్రాతిపదిక తీసుకుం టే ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తదితర అంశాలపై చర్చించారు. అయితే.. ఉద్యోగ నియామకం సమయంలో ‘స్థానికత’కు ఉన్న నిర్వచనమే ఈ మార్గదర్శక సూత్రాల్లోనూ వర్తిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సోమవారం (17వ తేదీ) హైదరాబాద్ వెళ్లనున్నారు. విభజన పనులకు సంబంధించి సమీక్ష జరుపనున్నారు.
Advertisement
Advertisement