టాస్క్‌ఫోర్స్ అదుపులో 11 మంది
వీరిలో పలువురు ‘దేశం’ కార్యకర్తలే
విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ మలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం నిల్వ చేసిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పలువురిని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి పెద్ద మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం షాపులు మూసేయడంతో పలు ప్రాంతాల్లో మద్యం నిల్వ చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి ఉంగుటూరు, గన్నవరం, ఉయ్యూరు మండలాల్లో దాడులు నిర్వహించారు. మొత్తం 1163 మద్యం సీసాలు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని 11మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉంగుటూరు మండలం నందమూరులో 230, మానికొండలో 140, ఇందుపల్లిలో 144, ఉంగుటూరులో 35 మద్యం సీసాలను, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరంలోని ఓ ప్రాంతంలో 178, మరో చోట 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు, గొల్లనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద 190 మద్యం బాటిళ్లు, రూ.34వేల నగదు, రామచంద్రపల్లిలోని ఓ రెస్టారెంట్ నుంచి 30 మద్యం సీసాలతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉయ్యూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆకునూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద 134 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఉయ్యూరు టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గండిగుంటలో ఓ వ్యక్తి నుంచి 67 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలో అప్పగించారు.
భారీగా మద్యం సీసాల పట్టివేత
Published Thu, Apr 10 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement