
చెట్టుపై వాలేందుకు వస్తున్న గబ్బిలాలు, చిన్నమండెం మండలం జల్లావాండ్లపల్లె వద్ద మర్రిచెట్టుకు వేలాడుతున్న గబ్బిలాలు
రాయచోటి : కేరళ, కర్నాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘నిఫా’ వైరస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రాణాంతకమైన వైరస్ పుట్టుకకు కారణమైన గబ్బిలాలు, పందుల సంచారం కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో చెట్లపై గబ్బిలాలు నివాసాలు ఏర్పరచుకుని రాంత్రింబవళ్లు ప్రజలకు అతి దగ్గరగా సంచరిస్తుంటాయి. కేరళలో ఈ వైరస్ కారణంగా 12 మందికిపైగా మృత్యు వాత పడ్డారన్న ప్రచారం జోరందుకుంది. గబ్బిలాలు, పందులతో పాటు వైరస్ సోకిన ప్రాంతానికి చెందిన వ్యక్తుల ద్వారా ఇతరులకు వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వైద్యుల హెచ్చరికలతో స్థానికుల ఆందోళనలు మరింత అధికమైంది. రాత్రి వేళల్లో ఆహారం కోసం వెళ్లే గబ్బిలాలు మామిడి, జామ, సపోటా తదితర పండ్లను తింటుంటాయి. గబ్బిలాలు, చిలుకలు, ఇతర పక్షులు కొరికి పడేసిన పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని చాలా మంది వాటిని తింటుంటారు. ప్రస్తుతం పక్షులు తిన్న కాయల ద్వారా ‘నిఫా’ వైరస్ సోకుతుందన్న ప్రచారంతో ఆ పండ్లకు ప్రజలు దూరమయ్యారు.
భయం పుట్టిస్తున్న సోషల్ మీడియా...
కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌పై సోషల్ మీడియా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను భయకంపితులను చేస్తోంది. గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వైరస్ విజృంభిస్తుందని, సోకిన వెంటనే మనుషుల ప్రాణాలు పోతాయని, ఈ వ్యాధికి మందులే లేవంటూ వస్తున్న సమాచారం అందరి గుండెల్లో గుబులు రేపుతోంది. గబ్బిలాలు కాయలను తినే ఫొటోలు సైతం వైరల్ అవుతుండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు మామూలు పండ్లకు సైతం పిల్లలను దూరం చేస్తున్నారు. .
జిల్లా వ్యాప్తంగా గబ్బిలాలు, పందుల స్థావరాలు..
‘నిఫా’ వైరస్ వ్యాప్తికి కారణమనే గబ్బిలాలు, పందులు జిల్లా వ్యాప్తంగా స్థావరాలను ఏర్పరుచుకున్నాయి. కడప నగర పరిధిలోని వన్ టౌన్ పోçలీసు స్టేషన్ వెనుకభాగంలోని వృక్షాలు, సుండుపల్లె పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న మర్రిచెట్టు, రాయచోటి మండల పరిధిలోని యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న ఉన్న చెట్లను, మాధవరం, చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో ఊడల మర్రిచెట్లను గబ్బిలాలు స్థావరాలుగా ఏర్పరుచుకున్నాయి. జిల్లాలో ఇవి మచ్చుకు మాత్రమే.
ఇక అటవీ ప్రాంత సమీపాలలోనూ, మామిడి, జామ లాంటి పండ్లతోటలు అధికంగా ఉన్న ప్రాంతాలలో వీటి సంచారం, నివాసాలు అధికంగా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఇక పందుల విషయం చెప్పనక్కరలేదు. చిన్నపాటి పల్లెలో సైతం పందుల సంచారం కనిపిస్తుంటుంది. మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలలో అయితే పందుల మందలు ఒక్కొక్క మారు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. పందుల ద్వారా మెదడు వాపు, ఇతర జబ్బులు సోకుతాయని ఎప్పటినుంచో ప్రచారం ఉన్నా వాటి నివారణకు నామమాత్రపు చర్యలు తీసుకోవడమే కాని పూర్తిస్థాయిలో నిలువరించలేదు. ఇలాంటి పరిస్థితులలో కొన్ని దశాబ్దాలుగా గబ్బిలాలను దేవతలుగా పూజించే గ్రామీణ ప్రజలు వాటిని దూరం చేసేందుకు ఎంతవరకు ఒప్పుకుంటారన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
వ్యాధి లక్షణాలు
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు రావడం, వాంతులు వస్తాయి, వెలుతురు చూస్తే కళ్లుమంటలేస్తాయి. ఈ లక్షణాలున్న వారు వెంటనే స్పృహను కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రభావం అంతా 7 రోజులలోనే జరిగిపోతుంది. ఇలాంటి లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ వైరాలజి ఇన్‌స్టిట్యూట్‌కు పంపించి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment