
పీఎంఎఫ్ భవనాలలో మెడికల్ కాలేజీ!
ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రొద్దుటూరులో కళాశాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే విషయం మాత్రం అధికారులు వెల్లడి చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప జిల్లాకు సంబంధించి ప్రాధాన్యత గల ఒక్క పరిశ్రమ గానీ, ప్రాజెక్టులు గానీ మంజూరు చేయలేదు.
కడప మినహా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులను మంజూరు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై చిన్న చూపు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కడప జిల్లాలో రాజంపేట మినహా అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. జిల్లా వాసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టారని భావించే చంద్రబాబునాయుడు కడపను విస్మరిస్తున్నార నే భావన ప్రజల్లో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కడప తర్వాత వాణిజ్య కేంద్రంగా ప్రొద్దుటూరుకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజిని ఏర్పాటు చేయించి తెలుగుదేశం పార్టీపై ఉన్న వివక్ష ముద్రను తొలగించుకోవాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నిస్తున్నారు.
పాలకేంద్రంలో కాలేజి ఏర్పాటుకు ప్రయత్నాలు..
జిల్లా ఆస్పత్రి 350 పడకల సామర్థ్యం కలిగి ఉంది. 350 పడకల ఆస్పత్రికి అనుబంధంగా 100 సీట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయవచ్చని వైద్యాధికారులు అంటున్నారు. విద్యార్థులు జిల్లా ఆస్పత్రిలో ప్రాక్టికల్స్, వైద్య సేవలను చేసినప్పటికీ వారికి హాస్టల్, బోధనాలయంతో పాటు ఇతర విభాగాల కోసం ఎర్రగుంట్ల రోడ్డులోని పాలకేంద్రాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇక్కడ పశువైద్య కళాశాల కొనసాగుతోంది. గోపవరం సమీపంలోని పంట పొలాల్లో పశువైద్య కళాశాల, హాస్టల్‌ను నూతనంగా నిర్మించారు. వీటి నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని రోజుల్లోనే పాలకేంద్రం నుంచి నూతన భవనాల్లోకి పశువైద్య కళాశాలను మారుస్తున్నారు. దీంతో మెడికల్ కాలేజీని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేయాలని అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.
అలాగే పాలకేంద్రం వెనుక వైపున ఉన్న అటవీశాఖ స్థలంలో మెడికల్ కాలేజి నూతన భవనాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన అధికారుల బృందంతో కలిసి టీడీపీ నాయకులు పాలకేంద్రం, అటవీశాఖ స్థలాన్ని పరిశీలించారు. కళాశాల కోసం అటవీశాఖ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ముఖ్యమంత్రికి సూచించాలని ఈ ప్రాంత నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.