రెండు రెట్లు పెంచిన ప్రైవేటు బస్సులు
ఆర్టీసీ బస్సులోనూ అధిక వసూళ్లు
రోడ్డెక్కిన 421 బస్సులు
పలు ప్రాంతాల్లో అడ్డుకున్న కార్మికులు
ఆయా డిపోల్లో ఉద్యోగుల వంటావార్పు
రాస్తారోకో, ధర్నాలకే పరిమితమైన వైనం
సమ్మెకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు
నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు వాహనదారులు పండగ చేసుకుంటున్నారు. దూరప్రాంతాలకు అధిక రేట్లను పెంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో నియమించిన కొత్త కండక్టర్లు సైతం ప్రయాణికుల నుంచి ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలను నియంత్రించాల్సిన అధికారులు కేవలం సీట్లకే పరిమితమవుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. పలు డిపోల్లో వంటవార్పు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు మానవహారాలు, ధర్నాలు జరిగాయి. శనివారం సమ్మె చేస్తున్న ఉద్యోగులు వెంటనే విధులకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆర్టీసీ సంఘాల నాయకులు న్యాయపరమైన సలహాలు తీసుకుని సమ్మెను ఉధృతం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
అధిక వసూళ్లు : సాధారణంగా నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు రూ. 800లు ఉంటే ప్రస్తుతం రూ. 2,000లు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే నాన్‌ఏసీ రూ. 450లు ఉంటే రూ.1,300లు వసూలు చేస్తున్నారు. బెంగళూరుకు నెల్లూరు నుంచి రూ. 800లు ఉంటే రూ. 2,400 వసూలు చేస్తున్నారు. ఆదివారంలో మరింత పెం చి నాన్‌ఏసీ బెంగళూరుకు రూ.1,540లు, హైదరాబాద్‌కు రూ.1,600లు పెంచారు ఈరీతిలోనే చెన్నై, వైజాగ్‌లకు ఎక్కువ మొత్తంలో చార్జీలను పెంచి ప్రయాణికుల నుంచి దండుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో సైతం ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. నెల్లూరు నుంచి వింజమూరుకు రూ. 46లు చార్జీ ఉండగా, కొత్త కండక్టర్లు రూ. 80లు వసూలు చేస్తున్నారు. సంగం నుంచి నెల్లూరుకు రూ.21లు ఉండగా రూ. 40ల వరకు వసూలు చేస్తున్నారు. చార్జీలు ఎందుకు పెంచారని ప్రయాణికులు ప్రశ్నిస్తే దిగిపోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.
పలు డిపోల్లో వంటవార్పు
ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు పలు డిపోల్లో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. యాజమాన్యం తీరుకు నిరసనగా అక్కడే వంట చేసి పంక్తి భోజనం చే శారు. గూడూరు, కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి డిపోల్లో కార్మికులు వంటావార్పును నిర్వహించా రు. మరికొన్ని ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి తమ నిరసనను తెలిపారు. గూడురులో సమ్మెలో ఉన్న కార్మికులకు విధుల్లో ఉన్న డ్రైవర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శనివారం జిల్లాలోని ఆయా డిపోల నుంచి మొత్తం 421 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 312 ఆర్టీసీ , 109 అద్దె బస్సులు ఉన్నాయి.
పలు పార్టీల సంఘీభావం...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా వైఎస్‌ఆర్‌సీసీ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, సీపీఎం, సీపీఐలతో పాటు వివిధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం నెల్లూరు ఆర్టీసీ బస్డాండ్‌లో స్వచ్ఛభారత్‌ను నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్‌కార్యదర్శి నారాయణ తెలిపారు.
సమ్మె హోరు దోపిడీ జోరు
Published Sun, May 10 2015 2:40 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement