మహారాష్ట్ర పోలీసుతో వీరేష్
బాలుడి అపహరణ కథ సుఖాంతమైంది. తిరుమలలో శుక్రవారం కిడ్నాప్‌నకు గురైన వీరేష్ ఎట్టకేలకు దొరికాడు. మహారాష్ట్రలోని మామనూరు పోలీసులు ఆదివారం ఉదయం కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సమాచారాన్ని తిరుమల పోలీసులకు చేరవేశారు. కుమారుడు దొరికాడని తెలియడంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దేవుడి సన్నిధిలో ఇలా జరగడం బాధగా ఉన్నా, ఆయన కృపతోనే తమకు బాబు దక్కాడని సంతోషపడ్డారు. సోమవారం ఉదయం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.
తిరుమల: బాలుడు వీరేష్ అపహరణ కథ ఎట్టకేలకు ముగిసింది. శ్రీవారి దర్శనార్థం మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ప్రశాంత్ దంపతులు తమ ఏడాదిన్నర బాబు వీరేష్‌తో కలిసి గురువా రం రాత్రి 11.30 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. అధిక రద్దీ కారణంగా వసతి దొరకలేదు. యాత్రి వసతి సముదాయం–2 ఎదురుగా ఉన్న మండపం వద్ద సేదతీరారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి బాబు కనిపించలేదు. చుట్టుపక్కల విచారించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
ఎలా దొరికాడంటే..!
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు బాలుడి కిడ్నాప్ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలించాయి. కిడ్నాపర్ శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బాబును అపహరించి, రింగ్ రోడ్డు గుండా తిరుపతికి వెళ్లిపోయాడు. తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్టాండ్‌లోని సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుపతికి చేరుకున్న నిందితుడు మంకీ క్యాప్ తీసేసి 8.45గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని టికెట్ కౌంటర్‌లో అనంతపురం జిల్లా గుంతకల్లుకు టికెట్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రైలులో ఉడాయించాడు. వెంటనే పోలీసులు ఓ బృందాన్ని అనంతపురానికి పంపా రు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడి ఫొటోతో పాటు బాబు ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. బాబు ఆచూకీ తెలపాలని విన్నవించారు. ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మహోర్ మండలం, రేణుకాదేవి ఆలయం కోనేరు వద్ద ఒక వ్యక్తి చంటిబిడ్డతో అనుమానాస్పదంగా ఉన్నాడని ఆలయంలో పనిచేసే క్షురకుడు పోలీసులకు సమాచార మిచ్చాడు.
మహారాష్ట్రలోని మహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసు అక్కడికి చేరుకుని విచారించారు. వెంటనే తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. వాట్సప్ ద్వారా బాబు, కిడ్నాపర్ ఫొటోలను పంపారు. ఆ బాబు వీరేష్ అని నిర్ధారించుకుని కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడు వీరేష్ స్వగ్రామానికి ఆ పోలీస్‌స్టేషన్‌కు 100 కిలోమీటర్ల దూరం ఉంది. నిందితుడు నిజామాబాద్ జిల్లా శాస్త్రి నగర్‌కు చెందిన విశ్వంబర్(43)గా గుర్తించారు. 50 గంటలుగా తీవ్రంగా శ్రమించిన తిరుమల పోలీసులు బాబు దొరికాడని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా కిడ్నాపర్‌కు, బాలుడి కుటుంబీకులకు ఉన్న సంబంధమేమిటో, ఎందుకు కిడ్నాప్ చేశాడో పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.
ప్రశంసల జల్లు..
తిరుమల పోలీసులను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ప్రత్యేకంగా అభినందించారు. అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, టీటీడీ సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని, దీంతో కిడ్నాప్ కేసును త్వరగా ఛేదించగలిగారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందికి, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా, పర్యవేక్షణతో ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment