యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎస్వీయూలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ శని వారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. ఈ దీక్ష సోమవారంతో మూడో రోజుకు చేరింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి పెరగడంతో దీక్షభగ్నం చేసేందుకు పోలీ సులు రెండు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి బలవంతంగా ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మిగిలిన ఐదుగురు సోమవారం దీక్షను కొనసాగించారు. అయితే వీరిని కూడా సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బలవంతంగా అరెస్ట్ చేసి దీక్ష శిబిరం నుంచి తరలించేశారు. ఈ దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన మబ్బుచెంగారెడ్డి, పసుపులే టి హరిప్రసాద్, నరసింహయాదవ్,శ్రీధర్ వర్మ, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పోలీసులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వెస్ట్ డీఎస్పీ ఎస్‌కే బాబు వాహనం కింద పడిపోయారు.
విద్యార్థులే ఆయనను పైకి లేపారు. విద్యార్థులు, నాయకులు ప్రతిఘటిస్తున్నప్పటికీ పోలీసులు లెక్కచేయకుండా రుయాకు తరలించారు. అనంతరం శిబిరాన్ని తొలగించారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నాయకులు సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉద్యమకారులు మాట్లాడుతూ తాము చేస్తున్న దీక్షలను అడ్డుకోవడానికి సీఎం పన్నాగం పన్నారని ఆరోపించారు. తమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, సమైక్యాంధ్ర కోసం ప్రాణాలున్నంత వరకు పోరాడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకులు పత్తిపాటి వివేక్, రమణ, సాధు రంగనాథం పాల్గొన్నారు. అరెస్టయిన వారిలో హరికృష్ణ యాదవ్, శేషాద్రి నాయుడు, ఆనంద్‌గౌడ్, రామ్మోహన్, శివకుమార్ ఉన్నారు.