పల్నాడు ప్రాంతంలో కొందరు పోలీసు అధికారులు పచ్చచొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులపై ఫిర్యాదు చేసేందుకు ఎవరు వచ్చినా వారిని దూషిస్తూ.. లాఠీలతో దాడి చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలనేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు కోకొల్లలని వివరిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో పని చేస్తున్న కొందరు పోలీసు అధికారులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల కంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూచనలే శిరోధార్యంగా భావిస్తూ చెలరేగిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు ప్రాంతంలో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు టీడీపీ కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు.
సీఐ రామారావుపై తొలి నుంచీ విమర్శలే..
గురజాల పట్టణ సీఐగా రామారావు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ఏం చెప్పినా తలాడిస్తూ అది అక్రమమా, సక్రమమా అనేది చూడకుండా రంగంలోకి దిగిపోతున్నారు. ఇతర పార్టీల నాయకులు, సానుభూతిపరులు నిజంగా అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్‌కు వెళ్తే దూషణలకు దిగుతూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళితే కచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ అర్బన్, రూరల్ ఎస్పీలు ఇద్దరూ సబల వంటి కార్యక్రమాలతో మహిళలను చైతన్యపరిచే చర్యలు చేపడ్తుంటే సీఐ రామారావు మాత్రం ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మహిళలను కూడా అసభ్యంగా దూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చర్లగుడిపాడు గ్రామానికి చెందిన భావనారుషి, అమరమ్మ దంపతులు అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారు, న్యాయం చేయాలంటూ ఆదివారం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.
అయితే సీఐ రామారావు తన భార్య అమరమ్మను దూషిస్తూ దాడికి పాల్పడడంతో మనస్తాపం చెందిన భావనారుషి పోలీసుస్టేషన్ బయటకొచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో భగ్గుమన్న ప్రజా సంఘాలు, మహిళ సంఘాలతోపాటు, ప్రతిపక్ష పార్టీ నేతలుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. గతంలోనూ అనేక కేసుల్లో సీఐ రామారావు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు విధులు నిర్వర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో పండుగలు, జాతరలు జరిగే సమయంలో సైతం బ్యానర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అధికార పార్టీ నేతలకు అనుమతులు ఇస్తూ, ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు అనేకం. చివరకు అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన పాటకచేరీలకు దగ్గరుండి మరీ డ్యాన్సులు వేయిస్తూ స్వామిభక్తి చాటుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాను ఉద్యోగిననే సంగతే మరిచి ‘మన పార్టీ.. మన ప్రభుత్వం’ అంటూ టీడీపీ నేతలతో కలిసి తిరగడం గమనార్హం. అధికార పార్టీ నేతలు చిన్న కేసు పెట్టినా నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లువేసి ఎదుటివారిని వేధిస్తూ... టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డా బెయిలబుల్ సెక్షన్‌లతోకేసులను వేసి మమా అనిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఐ రామారావుపై కేసు నమోదు
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన భావనారుషి, అమరమ్మ దంపతులను అసభ్యకరంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డ సీఐ రామారావుపై కేసు నమోదు చేశారు. అమరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తును గుంటూరు రూరల్ మహిళ పోలీసు స్టేషన్ డీఎస్పీ ధర్మేంద్రను విచారణ అధికారిగా నియమించినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ‘సాక్షి’కి తెలిపారు. పారదర్శకంగా విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. పోలీసు అధికారులు పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులతో స్నేహంగా మెలు గుతూ వారి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలే తప్ప, దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కాసు మహేష్‌రెడ్డి
గురజాల సీఐ రామారావుపై గురజాల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా సీఐ పనిచేస్తూ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అమరమ్మపై అసభ్యంగా దూషణలకు దిగి ఆమె భర్తను తీవ్రంగా కొట్టడంతో పోలీసు స్టేషన్ ఎదుటే పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఇందుకు కారణమైన సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment