‘సోలార్ హబ్‌తో భూములు కోల్పోతున్న రైతులకు కాకుండా దొంగలకు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది.
సోలార్ బాధితులకు భరోసా ఇచ్చిన సీపీఎం నేత ప్రకాష్ కారత్
కదిరి: ‘సోలార్ హబ్‌తో భూములు కోల్పోతున్న రైతులకు కాకుండా దొంగలకు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు సమాధానం చెప్పాలి. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. రైతుకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ సిటీ భూనిర్వాసితులతో మాట్లాడేందుకు గురువారం ఆయన వచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతరం వందలాది మంది రైతులు, సీపీఎం కార్యకర్తలతో కలిసి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన కారత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌పీ కుంటలో రోడ్డుపైనే బైఠాయించడంతో చివరకు కారత్‌తో పాటు నలుగురిని మాత్రం అనుమతించారు.