రాజధాని బస్టాండ్‌లో ధరల బాదుడు
► మరుగుదొడ్డికి వెళితే యూజర్ చార్జీలు
► ప్రతి వస్తువుపై అదనపు ధరలు వసూలు
► రూ.5 నుంచి రూ.10 వరకు వసూలతో ప్రయాణికుల జేబులకు చిల్లు
► ఆర్టీసీ ఎండీ ఉండే బస్టాండ్‌లోనే అదనపు ధరలపై చర్యలు నిల్లు
విజయవాడ బ్యూరో : ప్రకృతి పిలుస్తుందని వెళితే యూజర్ చార్జీలు వాత పడాల్సి వస్తోంది. దాహం తీర్చుకుందామని మినరల్ వాటర్ కొంటే దాని ధర చూసి గొంతులో తడారిపోతోంది. పోనీ లూజ్ వాటర్ కొని దప్పిక తీర్చుకుందామంటే అది తాగితే ఖచ్చితంగా విరేచనాలు కావడం కాయం. అల్పాహారం, భోజనం ఏదైనా ధరలు చూస్తే బెదరాల్సిందే. ఇవి ఎక్కడో కాదు రాజధాని ప్రాంతంలోని విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్(పీఎన్‌బిఎస్)లో ప్రయాణీకుల జేబులకు చిల్లుపడుతున్న వైనాలు. ఆర్టీసీ పరిపాలన కార్యాలయం కూడా బస్టాండ్‌పైనే ఏర్పాటు చేయడంతో దీన్ని ఎయిర్‌పోర్టు తరహాలో బస్‌పోర్టుగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు.
సౌకర్యాలు, అందాలు, హంగులతో దీన్ని ఆకట్టుకునేలా అభివృద్ధి చేయడం ఒక ఎత్తు అయితే దానికి మరోవైపు జరుగుతున్న తంతు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇక్కడ మూత్ర విసర్జనకు వెళితే రూ.5, మరుగుదొడ్డికి వెళితే రూ.10 యూజర్ చార్జీలు ఇచ్చుకోవాల్సిందే. మరోవైపు బస్టాండ్‌లోనే నీళ్లు, ఆహారం తీసుకోవాలంటే సగటు ప్రయాణికులు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బస్టాండ్‌లో ఉన్న స్టాల్స్ వద్ద ఏర్పాటు చేసిన ధరల పట్టిక బోర్డులకే పరిమితం. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇక్కడ మంచినీళ్లు బాటిల్ నుంచి బిస్కెట్ ప్యాకెట్ ధరలు మారిపోతుంటాయి.
మామూలుగా రూ.20 ఉంటే మినరల్ వాటర్ బాటిల్ ధర ఇక్కడ రూ.25, రూ.10 ఉండే బిస్కెట్ ప్యాకెట్ రూ.15, రూ.30 ఉండే కూల్ డ్రింక్ బాటిల్ రూ.40, రూ.45 వసూలు చేస్తున్నారు. రెండు ఇడ్లీ రూ.25, దోశ రూ.50, భోజనం రూ.90, టీ రూ.10, స్పెషల్ టీ రూ.20, హార్లిక్స్, బూస్ట్ రూ.30 ఇలా ఇష్టానుసారం ధరలు పెట్టి ప్రయాణీకులను బెదరగొడుతున్నారు. బయట కంటే ప్రతిదీ రూ.5 నుంచి రూ.10పైగా అదనపు ధరలకు విక్రయాలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు అటువైపు దృష్టి పెట్టారు. ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరరావు ఉండే ప్రధాన బస్టాండ్‌లోనే హైటెక్ మాటున అదనపు ధరలు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరని ప్రయాణికులు అంటున్నారు.