హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయనపల్లి సమీపంలో బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు.
అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.