
మద్యం మళ్లీ బోల్తా కొట్టించింది
30 అడుగుల గుంతలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
47 మందికి గాయాలు.. అందులో 40 మంది విద్యార్థులు
డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రకాశం జిల్లాలో ప్రమాదం
కనిగిరి: డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. సుమారు 30 అడుగుల గుంతలో పడి 78 మంది విద్యార్థులను దాదాపు మృత్యుముఖంలోకి తీసుకెళ్లింది. పెనుగం చిప్రోలు సంఘటన మరచిపోక ముందే జరిగిన ఈ ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తున్న 40 మంది విద్యార్థులతో పాటు మొత్తం 47 మంది గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెద అలవలపాడు వద్ద గురువారం వేకువన 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఉలవపాడు మండలం కరేడులోని పోతల వెంకట సుబ్బయ్య శ్రేష్టి (పీవీఎస్‌ఎస్) జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గత నెల 28 రాత్రి ఒంగోలుకు చెందిన ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్ బస్సులో విహారయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి మహానంది నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 78 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు, డ్రైవర్ తదితరులతో కలిపి బస్సులో మొత్తం 88 మంది ఉన్నారు. దీంతో కొందరు విద్యార్థులు బస్సు ప్లాట్‌ఫామ్‌పై పట్టా వేసుకుని కూర్చున్నారు. అంతా గాఢనిద్రలో ఉన్నారు. వారు కరేడు చేరుకుంటారనగా డ్రైవర్ కాలేషా బస్సుపై అదుపు కోల్పోయాడు. దీంతో అలవలపాడు వద్ద బ్రిడ్జి ఎక్కేముందు పక్కనే ఉన్న పిల్లర్లను ఢీకొట్టిన బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయిం ది.
మద్యం మత్తువల్లే ప్రమాదం
డ్రైవర్ కాలేషా తాగిన మైకంలో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, వైద్యసిబ్బంది ధ్రువీకరించారని కనిగిరి సీఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్ ఓనర్ మన్నం బ్రహ్మయ్య, డ్రైవర్ ఎస్‌కే కాలేషా, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
రెండు బస్సులు ఢీ
దొరవారిసత్రం (సూళ్లూరుపేట): ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టడంతో 23 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెల్లబల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.