ప్రజల కోసమే పనిచేద్దాం
సాక్షి, ఏలూరు :‘ప్రజల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.. వారికోసమే పనిచేద్దాం.. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు పునరంకితం అవుదాం’ అని పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). పార్టీ సారథిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌ఆర్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర 13 జిల్లాల్లో అత్యంత దారుణంగా నష్టపోయిన జిల్లా పశ్చిమగోదావరి అని, జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిక్షణం ప్రజల పక్షాన పోరాడటానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి ముందుకు నడిపిస్తామన్నారు. వచ్చేనెల 15 నుంచి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పర్యటించి, గ్రామస్థాయి వరకూ వెళ్లి ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అక్టోబర్ 3 నాటికి జిల్లా కమిటీలను ప్రకటిస్తామని వెల్లడిం చారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్ర రాజధాని ఏర్పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ప్రభుత్వంపై నాని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రుణమాఫీ పేరుచెప్పి రైతులు, డ్వాక్రా మహిళలను, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులు, యువకులను చివరకు బడుగు, బలహీన వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛన్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఆ మాటనైనా నిలుపుకోవాలన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరం పోరాడతామన్నారు. జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళతానని ఆళ్ల నాని అన్నారు.
నానికి అభినందనల వెల్లువ
జిల్లాలోని పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని ముందుకు నడిపించగల సత్తా ఉన్న నేత ఆళ్ల నాని అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. పదేళ్లుగా పదవికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం రాగానే అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇకపై ఆ పార్టీ వారి ఆటలు సాగవని అన్నారు. పార్టీకి నాని చేసిన సేవలకు, ఆయన పడిన కష్టానికి దక్కిన గౌరవమే జిల్లా అధ్యక్ష పదవి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయన్నారు. టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరడం లేదనే విషయాన్ని నాని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులకు పాల్పడటం మినహా ఒక్కపని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు అన్నారు. డ్వాక్రా రుణాలు సక్రమంగా చెల్లించే మహిళలను డిఫాల్టర్లుగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు.
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని వేధిస్తే ఖబడ్దార్’ అని కారుమూరి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా పార్టీని నడిపించాలని మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆకాంక్షించారు. చంద్రబాబుకు అత్యధిక స్థానాలు దక్కడంతో ప్రజలకు మేలు చేస్తారని ఆశించామని, ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు తగిన సమయం కేటారుుంచకపోవడం దారుణమన్నారు. నాని ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలపై పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రవీంద్ర సూచించారు. నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసుకుని, ప్రతి సోమవారం ప్రజల సమస్యలను మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి సూచించారు.
రూ.లక్షన్న మాత్రమే రుణమాఫీ చేస్తే రూ.మూడు లక్షల రుణం ఉన్న రైతులకు వడ్డీకే సరిపోదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ఆనాడు లేఖ ఇచ్చి, కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెడితే సహకరించకుండా ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి లేదంటున్న చంద్రబాబు తీరును ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఎండగట్టారు. గతంలో ప్రజల పక్షాన ఏవిధంగా పోరాటం చేశామో అదేవిధాంగా భవిష్యత్‌లోనూ నాని నాయకత్వంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి సత్తా ఏమిటో మరోసారి చూపించాలని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని చింతలపూడికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాజకీయం అనేది పుట్టిన తరువాత టీడీపీ వంటి అరాచక పార్టీని ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు అన్నారు. నానికి పూర్తిగా సహరించి పార్టీని ముందకు నడిపిస్తామని పార్టీ నేత చీర్ల రాధయ్య అన్నారు. దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలపై సెక్షన్-307 కింద కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇక మీదట అలా జరగకుండా నాని అండగా ఉండాలని పార్టీ నేత తలారి వెంకట్రావు కోరారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, పార్టీ నేతలు చలుమోలు అశోక్‌గౌడ్, ఊదరగొండి చంద్రమౌళి, కొఠారు రామచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, అప్పన ప్రసాద్, పార్టీ నాయకురాలు రంగమ్మ, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
రుణమాఫీ చేయకుండా రైతు బడ్జెట్ ఎందుకు: కొత్తపల్లి
‘అధికార పార్టీ ఎన్నికలముందు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చకుండా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం వల్ల ఏం ప్రయోజనం’ అని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ‘రాజకీయాల్లో గెలుపు ఓటములకు కాకుండా బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కాలేకపోయాననే నిరుత్సాహం ఆయనలో ఎక్కడా కనిపించడం లేదు. శాసనసభలో జగన్ ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు కూడా ఇంత సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషించలేరు.
వైఎస్ జగన్ మాట్లాడుతుంటే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా జరగనివ్వకుండా, మైకులు విరగొట్టిన ఘనత టీడీపీ నేతలది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైకులు పట్టుకుంటే రాద్ధాంతం చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడకూడదనుకున్నప్పుడు అసెంబ్లీలో కాకుండా ఎన్టీఆర్ భవన్‌లో సమావేశాలు పెట్టుకుంటే మంచిది’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఆళ్ల నాని నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఆయనకు పార్టీ నేతలంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని సుబ్బారాయుడు స్పష్టం చేశారు.