సాక్షి, విజయవాడ: రైతులపై రౌడీషీట్ తెరవడాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుబట్టారు. నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన గంపలగూడెం రైతులు నష్టపరిహారం కోసం పోరాడుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ న్యాయం చేయమని కోరితే క్రిమినల్ కేసులు, రౌడీషీట్లు తెరవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడి క్రషింగ్ చేయించే బాధ్యతను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ కాని రైతులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, సాధికారిత సంస్ధలో సహాయం చేయాల్పిందిబోయి.. సహాయ నిరాకరణ జరుగుతోందని ఆరోపించారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సింగపూర్‌కు పదిమంది రైతులను ఎందుకు పంపించారో అర్ధం కావడం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన వారి పెళ్ళిళ్ళు ఉన్నాయని అసెంబ్లీకి మూడు రోజులు సెలవులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. మరో రోజు సెలవు ఇచ్చి గంపలగూడెంలో రైతులను, డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీని, నాగార్జున సాగర్ రైతులు నీళ్ళు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్న ప్రాంతాలను సందర్శించాలని సూచించారు.
ఫాతిమా మెడికల్ కాలేజి స్టూడెంట్స్ 26 రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఫాతిమా కాలేజి విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటామంటున్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ఫాతిమా విద్యార్ధులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం కాపాడలేని పరిస్ధితిలో ముఖ్యమంత్రి, డాష్ బోర్డు ఉందని రఘువీరా వ్యాఖ్యానించారు
Comments
Please login to add a commentAdd a comment