
బాబూ.. డైలాగులొద్దు: రఘువీరారెడ్డి
గుడిబండ: డైలాగులు చెప్పడం మాని, పనితనాన్ని చేతల్లో చూపించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు బేషరతుగా రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు, టీడీపీ నేతలు కొన్ని వందల సభల్లో చెప్పారన్నారు.
ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేస్తామని, పింఛన్లు పెంచుతామని, అన్ని గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి నీరు ఇస్తామని, బెల్టుషాపులు రద్దు చేస్తామని సంతకాలు చేశారన్నారు. అయితే నేడు రుణ మాఫీకి సవాలక్ష కొర్రీలు వేస్తూ.. ఎన్నెన్నో షరతులు పెట్టారని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాకు పంటల బీమా కింద విడుదలైన రూ. 226 కోట్లు రుణాలకు జమ వేసుకోవడం ఆపేసి, రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీపై చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను (తన ఫోన్‌లో రికార్డు చేసిన వాయిస్‌ను) అక్కడే ఉన్న మహిళలకు వినిపించారు.