ఫ్యాన్ జోరు
- దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
- విజయమ్మ రాకతో కొత్త ఉత్సాహం
- అభ్యర్థుల ప్రకటన కలిసొచ్చిన అంశం
- టీడీపీలో తొలగని ఇంటిపోరు
- ప్రచారంలో చతికిలపడ్డ సైకిల్
విశాఖ జిల్లాలో ఇప్పుడు అన్ని దిక్కులా వీస్తున్నది ఫ్యాను గాలే. సార్వత్రిక ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తోంది. రాజన్న రాజ్యం సుప్రతిష్ఠితం చేయాలన్న జగనన్న ఆకాంక్షలను ఆహ్వానించే జనకోటి ఆశీస్సులు.. మహానేత సతీమణి విశాఖ ఎంపీ అభ్యర్థిగా స్వయంగా బరిలోకి దిగటం.. విజయమ్మ రోడ్‌షోలకు లభించిన అఖండ ఆదరణ, ప్రత్యర్థుల స్వయంకృతాపరాధాలు, కీలక తరుణంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తల నిర్లిప్తతతో ప్రచారంలో ఆ పార్టీల డీలా, ‘సైకిల్’ గుండెల్లో రె‘బెల్’ రైళ్లు..ఇలా బోలెడు కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలమంతా కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
సాక్షి,విశాఖపట్నం: ఎన్నికల ఘట్టంలో కీలకమైన ప్రచార పర్వం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. టీడీపీ ఇంకా అసమ్మతిసెగలు, నిరసనలు,తిరుగుబాటుదారులతో అవస్థలు పడుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశం. ఎక్కడా అసమ్మతి కనిపించలేదు.
లోక్‌సభ అభ్యర్థిగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీచేస్తుండడంతో వైఎస్సార్‌సీపీ ప్రచారంలో దూసుకు పోతోంది. ఆమె రోడ్‌షోల ప్రభావంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్‌గాలి ఉవ్వెత్తున వీస్తోంది. జిల్లా మొత్తానికే ఎన్నికల ప్రచారం జోష్ పెరిగింది. ఆమె ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలోని విశాఖ తూర్పు,పశ్చిమ,ఉత్తరం,దక్షిణం,గాజువాక,భీమిలి తదితర నియోజకవర్గాల్లో రోడ్‌షోలద్వారా ప్రజలను పలకరించి మొత్తం నియోజకవర్గాన్ని చుట్టేశారు. తద్వారా ప్రచారంలో వైఎస్సార్‌సీపీ పైచేయి సాధించింది.
అసమ్మతి సెగలతో టీడీపీ నేల చూపులు
ప్రచారంలో టీడీపీ బాగా వెనుకబడింది. అభ్యర్థులను ప్రకటించే విషయంలోనూ అనేక పేచీలు తలెత్తాయి. 15 నియోజకవర్గాల్లో రెండు బీజేపీకి ఇచ్చేయగా, సుమారు ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి రెబల్స్ బెడద తీవ్రంగా వేధిస్తోంది. గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, పాడేరు, అరకు, ఉత్తరం,భీమిలి తదితర స్థానాల్లో టిక్కెట్లు దక్కించుకున్న టీడీపీ అభ్యర్థులు రెబల్స్ నుంచి మద్దతులేక నేలచూపులు చూస్తున్నారు. ప్రచారానికి వెళ్లాలా? అసంతృప్తులను బుజ్జగించుకోవాలా? అనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
కొందరు అభ్యర్థులైతే ప్రచారం మాట దేవుడెరుగా రెబల్స్‌ను దారికితెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరికి డబ్బుల ఎరచూపించి దారికి తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల మొక్కుబడి ప్రచారం చేస్తున్నారు. యలమంచిలి, గాజువాక, భీమిలి,పాయకరావు పేట,అరకు ఇలా దాదాపు అన్నిచోట్లా సొంత పార్టీ నుంచే మద్దతు లేకపోతుండడంతో ప్రచారంలో అభ్యర్థులు వెనుకబడిపోయి కంగారుపడుతున్నారు.
విశాఖ లోక్‌సభ పరిధిలో బీజేపీ ప్రచారం కూడా మందకొడిగా ఉంది. ఉత్తరంలో నామినేషన్ల ఘట్టం వరకూ అభ్యర్థి తేలకపోవడం ఈ పార్టీ ప్రచారానికి మైనసయింది. దీనికితోడు కలిసిరాని టీడీపీ క్యాడర్ వీరికి పెనుసవాలయింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసే నేతలే లేకపోవడంతో దొరికిన కొత్త మొఖాలకు టిక్కెట్లిచ్చి మమ అనిపించింది. మొత్తానికి అసెంబ్లీ,లోక్‌సభ అభ్యర్థుల జాబితా తేలిపోవడం,నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జిల్లాలో అభ్యర్థులంతా ఇప్పుడు సమయం ప్రచారానికే ఉపయోగిస్తున్నారు. అయితే వీరికి విభజన సెగలు అడుగడుగునా తగులుతూ అభ్యర్థులకు చెమటలు పోయిస్తున్నాయి.