గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు (ఫైల్)
గుంటూరు వెస్ట్: బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోందని తెలిసి గుంటూరు జిల్లా నరసరావుపేటలో సోదాలకెళ్లిన పౌర సరఫరాల అధికారులను ఓ ప్రముఖ నాయకుడి కుమారుడు బియ్యం గోడౌన్‌లోనే నిర్బంధిస్తే.. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే గాని వారిని విడుదల చేయలేని దుస్థితి.. లారీ నిండా ఉన్న పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సంగతి తెలుసుకుని ఆ లారీని గురజాల ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌కు అధికారులు తీసుకెళ్తే .. పోలీసులను సైతం బెదిరించి దానిని తన అడ్డాకు తరలించుకుపోయాడు మరోనాయకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా... లెక్కకు మించిన ఉదాహరణలు. పల్నాడు ప్రాంతంలో గత టీడీపీ నాయకుల దాష్టీకాలపై కనీసం ఫిర్యాదు చేసే అవకాశం కూడా ప్రజలకు లేకుండా పోయింది. టీడీపీ నేతల అరాచకాలపై విసిగిపోయిన ప్రజలు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఇలాఖాలోనే ఈ దోపిడీ జరగడం విశేషం.
నెలకు రూ.20 కోట్లకు పైగానే తినేశారు
పల్నాడు ప్రాంతంలో దాదాపు 30 శాతం రేషన్ బియ్యం కేవలం కొందరు నాయకుల చేతిలోకి వెళుతోంది. దీని విలువ దాదాపు రూ.20 కోట్లు పైమాటే. ఈ బియ్యాన్ని నాయకులు ఇతర రాష్ట్రాలకే కాకుండా, కృష్ణపట్నం, కాకినాడు పోర్టులగుండా విదేశాలకు తరలిస్తున్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. ఈ అక్రమ బియ్యాన్ని గతంలో ముట్టుకోవాలన్నా అధికారులు భయపడే పరిస్థితి. మరీ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే అసలు రేషన్ దుకాణం నిర్వహించే నిజమైన యజమాని కూడా ఉండకుండా అక్రమార్కులే నేరుగా మొత్తం బియ్యాన్ని కాజేస్తున్న వైనాన్ని కూడా రాష్ట్ర అధికారులు గుర్తించారు.
దాడులను ఉధృతం చేసిన అధికారులు
రెండు నెలల నుంచి జిల్లా పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖాధికారులు సమన్వయంతో అక్రమ బియ్యం నిల్వలు, రవాణాపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.2 కోట్ల 82 లక్షలకు పైగా విలువైన 337 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వందమందికి పైగా 6ఎ కేసులు నమోదు చేశారు. వీటిలో అధిక సంఖ్యలో పల్నాండు ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.
దాడులు కొనసాగుతాయి
పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తామంటే ఊరుకునేది లేదు. ఇప్పటికే అనేక మందిపై దాడులు చేశాం. రానున్న కాలంలో మరిన్ని దాడులు కొనసాగుతాయి.
– టి.శివరామ్ ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment