అవినీతికి కేరాఫ్‌గా మారిన జిల్లా గృహనిర్మాణ సంస్థలో మరో అక్రమం చోటుచేసుకుంది.
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: అవినీతికి కేరాఫ్‌గా మారిన జిల్లా గృహనిర్మాణ సంస్థలో మరో అక్రమం చోటుచేసుకుంది. ఆ శాఖలో కొత్తగూడెం ఏఈగా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన అప్పారావుకు మళ్లీ జాయినింగ్ ఆర్డర్లు వచ్చాయి. విచారణ పూర్తికాకముందే సస్పెన్షన్ ఎత్తివేయడం ఎమిటనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నా యి. ఈ వ్యవహరమంతటికీ జిల్లా గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. 2012 జనవరి 1న ప్రవేశపెట్టిన మురికివాడల అభివృద్ధి పథకం కింద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో కమీషన్ వస్తుందని భావించిన అప్పటి కొత్తగూడెం ఏఈ అప్పారావు ఇళ్ల నిర్మాణం పూర్తికాక ముందే లభ్దిదారులకు అడ్వాన్స్‌గా రూ.46.15 లక్షలు చెల్లించారు. దీనిపై విచారించిన ఈఈ సాయినాథ్ ఈ మేరకు నివేదిక ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ అప్పారావును అదే సంవత్సరం ఫిబ్రవరి 9న సస్పెండ్ చేసి, అతనిపై విచారణకు అప్పటి పోలవరం సబ్ కలెక్టర్, ప్రస్తుత జిల్లా రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తున్న శివ శ్రీనివాస్‌ను నియమించారు. అ యితే ఏడాదిన్నర కావస్తున్నా విచారణ పూర్తి చేయలేదు.
హౌసింగ్‌లో పనిచేస్తున్న కీలక అధికారే దీనికి కారణమనే ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ పూర్తి కాకముందే అతనిపై సస్పెండ్‌ను ఎత్తివేసి, హైదరాబాదు ఎండీ ఆఫీసుకు సరెండర్ చేయడం ఆ ఆరోపణలకు మరింతగా బలం చేకూరుస్తోంది. ఈ విషయమై పీడీ భాస్కర్‌ను వివరణ కోరగా ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ అధికారి ఇంత వరకూ పూర్తి చేయలేదని, దీంతో ఏడాదిన్నరగా సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న అప్పారావు కలెక్టర్‌ను కలిసి తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నారని తెలిపారు. మరో నెలరోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని డీఆర్వో శివశ్రీనివాస్‌ను సైతం కలెక్టర్ ఆదేశించారని పేర్కొన్నారు.