
సాక్షి, అమరావతి/పొందూరు: రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం పసుపు– కుంకుమ కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల అపహాస్యం పాలయ్యాయి. డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పసుపు– కుంకుమ కింద పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది. మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) అమలుకు రాష్ట్రానికి కేంద్రమిచ్చిన రూ. 31.60 కోట్లు ఈ కార్యక్రమానికి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ డబ్బులతో గ్రామాల్లో ఏర్పాటుచేసిన వేదికలను కొన్నిచోట్ల స్థానిక టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు రికార్డింగ్ డాన్స్‌లకు వేదికలుగా మార్చారు. పట్టపగలే మహిళల రికార్డింగ్ డాన్స్‌లు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేసిన అధికారిక వేదికలపై టీడీపీ నేతలు రికార్డింగ్ డాన్స్‌లు వేయిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అనుమతి తెలుపుతోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ విప్ ‘కూన’కు చేదు అనుభవం
ప్రభుత్వం విప్ కూన రవికుమార్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని లోలుగు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమం జరగకుండా అడ్డుకొన్నారు. రవికుమార్ టెంట్‌లోకి అడుగుపెడుతుండగానే తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో పాటు, టీడీపీ స్థానిక నేత లోలుగు శ్రీరాములనాయుడుకు ప్రాధాన్యత నివ్వకపోవడంపై ప్రశ్నించారు. అయితే రవికుమార్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కొంతమంది కార్యకర్తలు టెంట్‌లు పీకేశారు. కుర్చీలు లాగేశారు. ఫైళ్లు విసిరేసారు. డౌన్ డౌన్ రవికుమార్ అంటూ నినాదాలు చేశారు. రవికుమార్ గోబ్యాక్ అంటూ నిరసన తెలియజేశారు. దీంతో పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాలేదు. దీంతో చేసేదిలేక పోలీసు బందోబస్తు మధ్య విప్ రవికుమార్ వెళ్లిపోయారు.