నాయకుల్లేని దేశం
* టీడీపీ పరిస్థితి దయనీయం
* నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు కరువు
* ఎస్సీ సెగ్మెంట్లకు ఇతరుల నేతృత్వం
* ‘తెలంగాణ’తో పూర్తిగా దెబ్బతిన్న సైకిల్
* ఎన్నికలపై నేతల్లో సన్నగిల్లుతున్న ఆశలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ఉద్యమ ప్రభావం, విశ్వసనీయత లేని విధానాలు, కీలక నేతల వలసలతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది. మాజీ మంత్రులు, ఎంపీ స్థాయి నేతలు పార్టీకి దూరమవుతున్న కొద్దీ అసెంబ్లీ సెగ్మెం ట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదు. ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేస్తుండడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం దొరకడం లేదు. గతంలో టీడీపీలో నియోజకవర్గ ఇనాచార్జ్ కోసం ఐదారుగురు పోటీ పడేవారు. ఇప్పుడు కోరికోరి అడిగినా.. ఆ పార్టీలోకి ఎవరూ రాని పరిస్థితి ఉంది.
పోటీ చేసేందుకు ఆసక్తి చూపే నాయకులు లేకపోవడం... కొత్తవారు వచ్చే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేరు. దశాబ్దం క్రితం వరకు జిల్లాలో తిరుగులేని పార్టీగా ఉన్న టీడీపీకి ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనే నాయకత్వం లేకపోవడంతో మండలాలు, గ్రామాల్లోనూ ఆ పార్టీ జెండా మోసేవారు కరువవుతున్నారు. 2009 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలను చవిచూసిన టీడీపీ... వచ్చే ఎన్నికలను ఆఖరి పోరాటంగా భావిస్తోంది. వరుస పరాజయాలకు తోడు మళ్లీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే దూరమయ్యేందుకు ఆ పార్టీ నేతలు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తిరోగమనం...
తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో తొమ్మిదేళ్లుగా అధికారం కోల్పోయిన టీడీపీ... ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేయడంతో పార్టీ బలం క్రమంగా తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణపై టీడీపీ అస్పష్ట వైఖరి ఆ పార్టీని జిల్లాలో బాగా దెబ్బతీసినట్లు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో పర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా... తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ మొత్తం ఖాళీ అవుతోంది.
2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ జిల్లాలో ములుగు, డోర్నకల్, నర్సంపేట, పాలకుర్తి స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత తెలంగాణపై అస్పష్ట వైఖరి కారణంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువ మంది సైతం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీకి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ఏళ్లకేళ్లుగా ఇన్‌చార్జ్‌లు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. పేదల అనుకూల పార్టీగా టీడీపీ జిల్లా నాయకులు చెప్పుకునే మాటలు.. చేతలకు పొంతనలేదనడానికి ఈ నియోజకవర్గాలకు ఆయా కేటగిరీల నేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించకపోవడమే నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి.
స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) నియోజకవర్గం...
టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పోటీ వాతావరణం ఉండేది. కానీ.. ఆ పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం ఎవరూ ఇన్‌చార్జ్‌గా లేరు. ఎస్సీ నియోజకవర్గానికి అదే సామాజికవర్గం నేతను ఇన్‌చార్జ్‌గా నియమించకపోగా, కట్ట మనోజ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం టీడీపీ శ్రేణులకే మింగుడుపడడంలేదు.
వర్ధన్నపేట (ఎస్సీ) నియోజకవర్గం... గతంలో టీడీపీకి ఇది బలమైన సెగ్మెంట్. 2009 ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరఫున టీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీ పరిస్థితి మారిపోరుుంది. ఆ పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన ఏ నేతకూ ఇక్కడ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించలేదు. ఈ వర్గం కాని ఈగ మల్లేశంకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ నేతలను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించకపోవడంతో టీడీపీ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు.
మహబూబాబాద్ ఎస్టీ
రిజర్‌వడ్ సెగ్మెంట్... ఇక్కడ టీడీపీకి నాయకులే లేరు. గత ఎన్నికల్లో మహా కూటమి తరఫున టీఆర్‌ఎస్ పోటీ చేసింది. ఆ తర్వాత నుంచి ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌లను నియమించలేదు. పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఇక్కడ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.