హక్కుల సాధనకు ఉద్యమిద్దాం | Rights to accomplish udyamiddam | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఉద్యమిద్దాం

Published Mon, Oct 27 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

Rights to accomplish udyamiddam

అనంతపురం కల్చరల్ : అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అఖిల భారత వడ్డెర్ల సంఘం గౌరవాధ్యక్షుడు నారాయణస్వామి, అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి హక్కులు సాధించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చిందని, అలా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆదివారం అనంతపురంలోని ఎల్‌కేపీలో వడ్డెర్ల సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజుల గోపాలక్రిష్ణ, కడప పీఠాధిపతులు సత్యనారాయణ స్వామీజి, రాష్ట్ర నేత నారాయణస్వామి ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తరాల నుంచిపెత్తందార్ల కాళ్లకింద నలిగిపోయిన వడ్డెర్లు ఇకనైనా మేల్కొవాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వడ్డెర్లు అధిక సంఖ్యలో ఎన్నికైనపుడు మాత్రమే ప్రభుత్వాలు మన మాట వింటాయన్నారు. ఇతరులకు తోకల్లా ఇంకెంత కాలం ఉంటామని ప్రశ్నించారు. జిల్లాలోని 63 మండలాలలో ప్రతి ప్రాంతానికి ఒక అధ్యక్షున్ని ఎన్నుకుని సంఘాన్ని బలోపేతం చేద్దామన్నారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, కార్మికులకు ఆడ మగ తేడా లేకుండా లేబరు కార్డులు మంజూరు చేయాలని, సొసైటీలు ఏర్పాటు చేసుకుని సంఘటితంగా ఉండాలని తీర్మానించారు. ఏ పోరాటాలు చేసినా శాంతియుతంగా ఉండాలని, మన సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చేట్టు ఉండాలని స్వామీజీ ఉద్భోదించారు. ఈ సందర్భంగా కార్తీక మాస విశిష్టతను తెలియజేస్తూ ఆధ్యాత్మిక పరంపరలో వడ్డెర్లు మమేకం కావాలన్నారు. సాయంత్రం దాకా వడ్డెర్ల సభలు కొనసాగినా ఆధ్యంతం ఉత్సాహంగా కేరింతలు, కరతాళధ్వనులతో కళాప్రాంగణలో సందడి చేశారు.

అంతకుముందు ఉదయం ప్రజా కళాకారులు తమదైన ఆటపాటలతో చైతన్యం కల్గించారు. ప్రాచీన కళారూపాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వికె గంగన్న, నాయకులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాసులు, మంజుల నారాయణ, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement