అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు..
అటోళ్లు ఇటు..
ఇటోళ్లు అటు..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల ఎంపిక పరీక్షా కేంద్రాల ఏర్పాటు గందరగోళంగా మారింది.
తూర్పు ప్రాంత అభ్యర్థులకు పశ్చిమలో, పశ్చిమ ప్రాంతంలోని వారికి తూర్పులో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తీర్ణం పరంగా జిల్లా విశాలంగా ఉంటుంది. తూర్పు ప్రాంతంలోని వారికి జిల్లా కేంద్రంతోపాటు, పశ్చిమలోని నిర్మల్‌కు వెళ్లాలంటే 150 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐదారు గంటల ప్రయాణం తప్పదు.
కానీ, అవేమి పట్టించుకోని ఏపీపీఎస్సీ జిల్లా కేంద్రంతోపాటు, రెవెన్యూ డివిజన్లు, బెల్లంపల్లిలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇష్టారీతిన అభ్యర్థులకు కేంద్రాలు కేటాయించారు. తూర్పు ప్రాంతం వారికి తూర్పులో, పశ్చిమ వారికి పశ్చిమలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇటీవల నిర్వహించిన వీఆర్వో, వీఆర్‌ఏ ఎంపిక పరీక్షల్లోనూ అధికారులు ఇష్టారాజ్యంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు పరీక్ష రాయలేక పోయారు.
కొందరు పరీక్షా కేంద్రాలు దూరంగా ఉన్నాయని, వెళ్లకుండా ఉండిపోతే, మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి కేంద్రాలకు చేరేసరికి సమయం మించి పోవడంతో పరీక్ష రాయలేదు. కనీసం ఇప్పుడైనా ఆయా ప్రాంతాల వారికి అక్కడే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారని భావించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది.
అందుబాటులో హాల్‌టికెట్లు
పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం డిసెంబర్ 12, 2013న నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ, ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పది రోజుల ముందుగానే వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు పెట్టాల్సి ఉన్నా, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఆలస్యంగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండడంతో అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్‌లలో ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1(జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటి), మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2( గ్రామీణాభివృద్ధి(ఏపీ ప్రాధాన్యం) పరీక్షలు ఉన్నాయి. దీంతో ఉదయం పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం, పరీక్ష పూర్తయిన తరువాత గమ్య స్థానాలకు చేరుకోవడం అభ్యర్థులకు అగ్ని పరీక్షే.
పరీక్షా కేంద్రాలు ఇవే..
జిల్లా వ్యాప్తంగా 46,020 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం జిల్లా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్లలో 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 65, నిర్మల్‌లో 32, మంచిర్యాలలో 37, ఆసిఫాబాద్‌లో 12, ఉట్నూరులో 17, బెల్లంపల్లిలో 24 పరీక్షా కేంద్రాలను ఉన్నాయి.