ఏపీలో రూపాయికి ఇడ్లీ.. రూ.5కి భోజనం
* ఏపీ పురపాలక మంత్రి నారాయణ
* నవంబర్‌లో అన్న క్యాంటీన్లు ప్రారంభం
* మధ్యాహ్నం సాంబార్ అన్నం/పులిహోర/పెరుగన్నం
* రాత్రి భోజనంలో రెండు చపాతీలునాలుగు నగరాల్లో 35 క్యాంటీన్లు
సాక్షి, హైదరాబాద్: అన్న క్యాంటీన్లను నవంబర్ నుంచి ప్రారంభించి రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు రెండు చపాతీలు ప్రజలకు అందచేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూట్లా అన్న క్యాంటీన్లలో ఆహారం లభ్యమవుతుందని చెప్పారు. శనివారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అనంతరం మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్న క్యాంటీన్లను నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు.
ఉదయం పూట ఒక ఇడ్లీ(65 గ్రాములు), సాం బార్ కలిపి ఒక రూపాయికి ఇస్తామన్నారు. మధ్యాహ్నం భోజనంలో సాంబార్ అన్నం (350 గ్రాములు) లేదా పులిహోర లేదా పెరుగన్నం రూ.5కే ఇస్తామన్నారు.రాత్రిపూట కూరతో కలిపి రెండు చపాతీలను రూ.5కే ఇస్తామన్నారు. రాగి సంకటి సరఫరా చేయూలని అనంతపురం జిల్లా ప్రజలు కోరినందున దీన్ని కూడా మెనూలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తొలి విడతలో విశాఖలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5 క్యాంటీన్లు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరిస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపా రు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు.
పౌర సేవలకు కొత్త సాఫ్ట్‌వేర్
మున్సిపాలిటీలలో జనన ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకూ ఇంట్లో కూర్చునే దరఖాస్తు చేసుకునేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల లేదా రెణ్నెల్లలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల నుంచి 540 ఫిర్యాదులు అందగా 48 గంటల్లో 390 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. పురపాలకశాఖ పరిధిలోని సమస్యలపై ఫొటో తీసి ఛిఛీఝ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు పంపితే స్పందిస్తామన్నారు. పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు. అనధికారిక నీటి కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించటం తదితర చర్యల ద్వారా ఆదాయూన్ని సమకూర్చుకుంటామని తెలిపారు.